తెలంగాణ గ్రూప్ 3 షెడ్యూల్ విడుదల, నవంబర్ 10 నుంచి హాల్ టికెట్లు
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు.
నవంబర్ 18న పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, గ్రూప్ 3 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల లోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు. ఇక, నవంబర్ 10న హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
సెలక్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, క్వశ్చన్ పేపర్లు జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్ టికెట్లను తర్వాత జారీ చేయబోమని స్పష్టం చేసింది. తెలంగాణలో దాదాపు 1380కిపైగా గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు.
గ్రూప్ 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పేపరుకు రాయడానికి రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. వ్రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications