తెలంగాణలో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇవే..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగుతుందని.. అలాగే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు ఉంటాయని అన్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అధికారులు రూపొందించారు. పోలీసులు నిఘా పెంచారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగుతుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇక ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈ నెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12 న నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. అదేరోజు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనుంది.

ఇక ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. రూ. 50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలి. లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. అయితే పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసీప్ట్ ఇస్తారు. దానిపైనే అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications