శాంతించిన వరుణుడు... తప్పిన భారీ వానగండం.. కానీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ అయితే తాజాగా బంగాళాఖాతంలో క్రమంగా వాయుగుండం బలహీన పడుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణకు భారీ వానగండం తప్పినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ రామగుండం దగ్గర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు రాగల 12 గంటల్లో పూర్తిగా వాయుగుండం బలహీన పడనున్నట్టు పేర్కొంది.
తప్పిన భారీ వానల గండం.. కానీ
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నేడు పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే సమయంలో రేపటి నుంచి ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు
భారీ నుండి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండవలెననీ చెప్పిన భారత వాతావరణ శాఖ తాజాగా వాయుగుండం బలహీనపడటంతో రాబోయే ఐదు రోజులు అంటే సెప్టెంబర్ 6 తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇక ఈ ప్రభావంతో రాబోయే 24గంటలలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
సెప్టెంబర్ 6 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు
ఇక హైదరాబాద్ సిటీ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సెప్టెంబర్ 6 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలే కురుస్తాయని అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాదు వాతావరణ కేంద్రం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.
అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ఇందులో భాగంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎక్కడికక్కడ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని పునరావస కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కలిగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు.
పరిహారం ప్రకటన .. అండగా ఉంటామన్న సీఎం రేవంత్
అంతేకాదు ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు ఐదు లక్షలు, పశువులు చనిపోతే 50,000, పంట నష్టం జరిగితే ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications