'బతుకమ్మ పండగ' లో భారీ మార్పులు.. మహిళలతో సైకిల్, కారు, బైక్ ర్యాలీలు, డ్యాన్స్ లు, ఫ్యాషన్ షోలు..!
బతుకమ్మ పండగ వచ్చేస్తుంది. 'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి కార్నివాల్ తరహాలో బతుకమ్మ పండుగను నిర్వహించాలని నిర్ణయించినట్లు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ సారి బతుకమ్మ పండగ ఉత్సవాలు ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ పండగ వరంగల్ లోని వేయి స్తంభాల గుడి వద్ద ఈనెల 21 న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆ శాఖ ఎండీ వల్లూరి క్రాంతి సమక్షంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కార్నివాల్ తరహాలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రపంచస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రతి కళాశాలలో బతుకమ్మ పండగ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాల్లో సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఎయిర్ పోర్టులో తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా వెల్ కమ్ నృత్యాలు ఉంటాయని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఆర్ట్ క్యాంప్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, సెప్టెంబర్ 28 న సైకిల్ రైడ్, గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా 10 వేల మంది మహిళలతో సైకిల్ రైడ్, సెప్టెంబర్ 29న మహిళలతో బైక్ రైడ్స్ , సెప్టెంబర్ 30 న వింటేజ్ కారు ర్యాలీ, ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఉంటాయి.

అలాగే సెప్టెంబర్ 27 న సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ, 29న ఐటీ రంగం ఉద్యోగులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ పూల పండగ నిర్వహణ ఉంటాయి.












Click it and Unblock the Notifications