మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత.. అక్కడ భవనం బాంబులతో పేల్చివేత!
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఆక్రమణలకు గురైన చెరువులు, ఎఫ్.టి.ఎల్ పరిధి, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. బుల్డోజర్లతో ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. ఇక తాజాగా ఆపరేషన్ మూసీ మొదలుపెట్టిన హైడ్రా అధికారులు ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతాలలో అక్రమ నిర్మాణాల పైన సర్వే చేస్తున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాలలో ఇళ్ళకు మార్కింగ్
హైదరాబాద్ నగరంలోని మూసి పరివాహక ప్రాంతాలలో హైడ్రా అధికారుల సర్వే నేపథ్యంలో హై టెన్షన్ చోటుచేసుకుంది. మూసి పరివాహక ప్రాంతాలలో ప్రజలు ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఈ క్రమంలో అధికారులు మూసి పరివాహక ప్రాంతాలలో ఎఫ్డీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేసి వెళుతున్నారు.

మూసీ పరీవాహక ప్రాంతాలలో ప్రజల డిమాండ్ ఇదే
మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని, కూల్చివేతలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో రెండంతస్తుల బిల్డింగ్ ఉన్న వారికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఎలా ఇస్తారంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని మూసీ వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక సర్వే బృందాలను అడ్డుకుంటున్న స్థానికులు
ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతాలలో భారీ బందోబస్తు మధ్య సర్వే అధికారులు, సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 13వేల ఆక్రమణలను గుర్తించిన అధికారులు, అర్హులైన నిరుపేదలకు పునరావాసం కల్పించేందుకు కూడా వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు మూసి పరివాహక ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో స్థానికులు ఎక్కడికక్కడ సర్వే అధికారులను అడ్డుకుంటూ ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల్లో ఆందోళన.. ఉద్రిక్త వాతావరణం
పటిష్టమైన భారీ బందోబస్తు మధ్య ఒక్కొక్క టీం లో ఎంఆర్ఓ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో తమ ఇల్లు కూల్చి వేస్తారు అన్న ఆందోళనలో ఉన్న స్థానికుల అడ్డగింతలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మల్కాపూర్ చెరువులో బాంబులతో బహుళ అంతస్తుల భవనం పేల్చివేత
ఇదిలా ఉంటే మరోవైపు సంగారెడ్డి లోని మల్కాపూర్ చెరువులో కూడా అక్రమ నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేస్తున్నారు. చెరువు నీళ్ల మధ్యలో కట్టిన బహుళ అంతస్థుల భవనాన్ని బాంబులు పెట్టి పేల్చి మరీ అధికారులు కూల్చివేశారు. ఈ సమయంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరి పడడంతో ఇద్దరు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
12 సంవత్సరాల క్రితం నిర్మించిన నీళ్ళలోనే భవనం
సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో నీళ్లలోనే భవనాన్ని నిర్మించారు. ఈ భవనం లోపలికి వెళ్లడానికి కొంత దూరం మెట్లు కట్టి మరీ నీళ్లల్లో భవనాన్ని నిర్మించారు ఆ యజమాని కుటుంబ సభ్యులు వీకెండ్ లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications