కొత్త రేషన్ కార్డుల కోసం తాజా నిబంధనలు.!!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని ప్రకటించింది. ఇందు కోసం గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబి తాలో పేర్లు లేని కుటుంబాలు ప్రస్తుత సభల్లో దరఖాస్తులు ఇవ్వాలని మంత్రులు సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ, బస్తీ సభలు ప్రారంభమయ్యాయి. ఈ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడవుగా నిర్ణయించారు. ఈనెల 26న రేషన్ కార్డుకు అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, గత డిసెంబర్‌లో ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఆ సమయంలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది.

గ్రామ సభల్లో దరఖాస్తులు
కానీ, రేషన్ కార్డు దరఖాస్తుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ గ్రామసభల్లోనూ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిరంతర ప్రక్రియ
ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 5,73,069 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం 83,285 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. దీంతో, కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు, అధికారులు చెబుతున్నారు.
అదే విధంగా.. నూతన రేషన్‌కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారం ఇప్పటికే సిద్ధమైంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications