హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!!
TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఉన్న బస్టాపు లను మార్పు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది. ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ రామంతాపూర్ వైపు పొడిగింపు పనులు జరుగనున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉప్పల్ నల్ల చెరువు వద్దకు తాత్కాలికంగా జిల్లాల స్టాప్ మార్చి.. ప్రస్తుతం సిటీ బస్సులు ఆగుతున్న బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకీకరించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ లో బస్టాపుల్లో మార్పులు జరగనున్నాయి. మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. రూ.3.20 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదన లకు స్టాండింగ్ కమిటీ సాధారణ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న బస్టాపును తాత్కాలికంగా ఉప్పల్ నల్లచెరువు వద్దకు మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే చెరువు వద్ద విస్తరణ పనులు చేపట్టారు. లోకల్ బస్సులు నిలుపుతున్న బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకీకరించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న భవనం, బస్ షెల్టర్లు, డ్రైవ్ వేలు తొలగించి.. కొత్తగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

అధికారుల చర్చలు... కార్యాచరణ అమలు
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఎనిమిదేళ్లుగా సాగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ ఆవలి వరకు జాతీయ రహదారుల సంస్థలోని ఆర్ అండ్ బీ అధికారులు నిర్మిస్తుండగా.. ఇక్కడి నుంచి రామంతాపూర్ వైపు పొడిగింపు పనులు జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. గతంలోనే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయగా పలు కారణాలతో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. తాజాగా తిరిగి పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకల మళ్లింపు/పరిమిత లేన్లలో అనుమతించే అవకాశముంది. ఈ క్రమంలోనే బస్టాప్ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూర్లు, ఇతరత్రా పనుల కోసం వెళ్లే వారికి ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్టాప్ ఉండడం అనువుగా ఉంటుంది. మెట్రోలో వెళ్లి బస్సులు ఎక్కే అవకాశముంది. దీని పైన ప్రయాణీకుల సమస్యలను సైతం పరిగణలోకి తీసుకొని.. అధికారికంగా మార్పుల పై నిర్ణయం ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications