బాధపెట్టి ఉంటే క్షమించండి: రాజీనామా తర్వాత బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ఇంత కాలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని చెప్పారు. తన లాంటి సామాన్య కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ అధిష్టానం అంచనాలను అందుకున్నానని భావిస్తున్నానని.. అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, సహకరించిన పార్టీ నేతలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సందర్భాల్లోనూ మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తన బాధ్యతను నిర్వర్తించానని.. తెలియక ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించాలని కోరారు బండి సంజయ్.

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ వెల్లడించారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేస్తామన్నారు.
కాగా, మంగళవారం జేపీ నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి సంబంధించిన మార్పులను బండి సంజయ్‌కి జేపీ నడ్డా వివరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈటల రాజేందర్‌ను తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. కాగా, బండి సంజయ్ సంజయ్ కి కేంద్రమంత్రి పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతోంది.
Officially signing off as @BJP4Telangana State President 🙏
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023
Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri…
తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చింది పార్టీ అధిష్టానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిని నియమించారు. ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఆ పదవికి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు కూడా బీజేపీ కొత్త అధ్యక్షులు నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications