సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ పై కేంద్రం కీలక నిర్ణయం..!!
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీఆర్ఎస్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వీఆర్ఎస్ కు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డీవోపీటీ (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) సోమేశ్ స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతిచ్చింది. వీఆర్ఎస్ కు అనుమతి వస్తూనే ఆయన అధికారికంగా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా తాజాగా సీఎం కేసీఆర్ తో కలిసి మహారాష్ట్ర పర్యటనలోనూ పాల్గొన్నారు.
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్దమైంది. బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ కుమార్ 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. పలు శాఖల్లో అనేక హోదాల్లో పని చేసారు. సుదీర్ఘ కాలం గ్రేటర హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గానూ వ్యవహరించారు. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించారు.

అయితే క్యాట్ ఆదేశాలతో ఆయన తెలంగాణలోనే కొనసాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో, హైకోర్టు ఆయన్ను తెలంగాణ నుంచి రిలీవ్ అయి వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో, ఆ వెంటనే సోమేష్ ఏపీలో రిపోర్టు చేసారు. ఏపీలో రిపోర్టు చేసినా, ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తరువాత సోమేశ్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమేశ్ వీఆర్ఎస్ కు ఏపీ సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
ఇప్పుడు కేంద్రం సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. సోమేశ్ అనుమతి చేసుకున్న సమయం నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు సోమేశ్ రాజకీయంగా అడుగులు వేయటానికి లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమేశ్ పైన నమ్మకం ఉంది. జాతీయ పార్టీగా రూపారంతం చెందిన బీఆర్ఎస్ లో సోమేశ్ కు కీలక పదవి ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

కేంద్రం నుంచి వీఆర్ఎస్ కు ఆమోదం రావటంతో తాజాగా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు సోమేశ్ కూడా వెళ్లారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సోమేశ్ ప్రత్యక్షమయ్యారు. వేదిక పైనే ఆయన గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావన చేసారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు జాతీయ స్థాయి ప్రతినిధిగా సోమేశ్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, తెలంగాణ ఎన్నికలు ఉండటంతో ముందుగా రాష్ట్రంలో ఆయన సేవలు వినియోగించుకుంటారనే మరో వాదన వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సోమేశ్ పొలిటికల్ ఇన్నింగ్స్ లో లభించే పదవి పైనా చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications