హైదరాబాద్ దగ్గరలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
హైదరాబాద్ నగర వాసులకు వీకెండ్ లో ఎంజాయ్ చేసేందుకు దగ్గర్లో చాలానే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగివచ్చే విధంగా ఈ ప్రదేశాలు కనివిందు చేస్తున్నాయి. నగరానికి కొద్ది దూరంలోనే ఈ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని కట్టిపడవేస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవి అనువైన ప్రదేశాలుగా ఉన్నాయి.
పోచారం వన్యప్రాణి అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలగే హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి అడవిలో ప్రయాణం చేస్తూ పక్షులను చూడడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. 1916-1922 మధ్య ఆలేరు నదిపై పోచారం ఆనకట్ట నిర్మించిన తరువాత ఏర్పడిన పోచారం సరస్సు నుండి ఈ అభయారణ్యం పేరు వచ్చింది. ఈ అభయారణ్యం 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇటీవల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ జంతువులను దగ్గరగా చూడొచ్చు.
రాచకొండ కోట చారిత్రక కట్టడంగా విరాజిల్లుతోంది. ఈ కట్టడం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 14వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు. కోట చుట్టూ కొండలు, గుహలు, కోనేరు, మెట్ల బావులు, ఆలయాలు వంటివి ఉన్నాయి. వీటిని సందర్శించడానికి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనువైన సమయంగా చెబుతారు. ట్రెక్కింగ్ చేసేవారికి బాగుంటుంది. అలాగే ఇక్కడ గన్నేర్లలోని జాలువారు సెలయేళ్లు, మొల్కచెర్వు లోని ఎత్తయిన జలపాతాలు, పచ్చటి కొండలు, అడవిలో నెమళ్లు కనువిందు చేస్తాయి.
నాగార్జున సాగర్ డ్యామ్ హైదరాబాద్ నుండి సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండో స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నాగార్జున కొండ, బోటింగ్, వాటర్ ఫాల్స్, యానిమల్ ఫారెస్ట్, పురాతన బౌద్ధ నిర్మాణాలు కనువిందు చేస్తాయి. మొత్తం 26 గేట్లను ఎత్తినప్పుడు పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చి డ్యామ్ అందాలనూ వీక్షిస్తారు.

కొలనుపాక జైన మందిర్.. తెలంగాణలో ప్రముఖ జైన క్షేత్రంగా ఉంది. ఈ జైన మందిరం హైదరాబాద్ కు 65 కి. మీ దూరంలో ఆలేరుకు సుమారు 6 కి. మీ. దూరంలో ఉంది. ఈ దేవాలయం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఈ ఆలయంలో మూడు విగ్రహాలు కనిపిస్తాయి. రిషభ, స్వామి నేమినాథ్, స్వామి మహావీరుడు. మహావీర్ విగ్రహాన్ని జెడ్ స్టోన్ తో నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడి వాతావరణం, శిల్పకళా ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications