ఈవీఎంలు రద్దు చేయాల్సిందే.. ఓయూ వేదికగా కవిత సెన్సేషనల్ కామెంట్స్!
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థులతో కలిసి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కవిత.. తెలంగాణ ఉద్యమంలో ఓయూ పోషించిన విప్లవాత్మక పాత్రను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ, రాజకీయ పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూనే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనివర్సీటల పట్ల జరిగిన నిర్లక్ష్యానికి గాను విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన దాఖలాల్లేవ్. ఓయూ విద్యార్థుల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా అదే కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత ప్రత్యేక పార్టీని స్థాపించి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఓయూలో అడుగుపెట్టిన కల్వకుంట్ల కవితకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేష్ చతుర్థిని ఏకం చేయడానికి ఎలా ఉపయోగించారో.. తెలంగాణ ఉద్యమంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటిచెప్పడానికి బతుకమ్మ పండుగను అలాగే మల్చుకున్నామని ఆమె వెల్లడించారు. బతుకమ్మ ఏంటే కేవలం వేడుక మాత్రమే కాదని.. అందులోని ప్రతి పువ్వు సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. రేపటి తెలంగాణ కూడా అదే సమగ్రతను, సమానత్వాన్ని ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.

ఉన్నత విద్య ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతుండగా.. ఆమె గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 నెలల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు ప్రకటించిన్పటికీ.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఇటీవల లా కాలేజ్ సందర్శించినప్పుడు కనీసం తాగునీరు లేక, ఒక్కో గదిలో 8 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటం చూశానని వెల్లడించారు. యూనివర్సిటీల్లో 74 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేశాయని, ఆ నిర్లక్ష్యంలో భాగమైనందుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. సీఈసీ రాజీనామా డిమాండ్ తో తాను ఏకీభవించడం లేదని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కేవలం కమిషనర్‌ను మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రధాని మోదీ మరో నమ్మకస్థుడిని ఆ పదవిలో కూర్చోబెడతారని.. కాబట్టి ఏకంగా ఈవీఎం విధానాన్ని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ పద్ధతిని పునరుద్ధరించాలని కవిత డిమాండ్ చేశారు.
విద్యార్థి యూనియన్ ఎన్నికలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. "రాహుల్ గాంధీ అశోక్ నగర్‌లో జాబ్ క్యాలెండర్, రోహిత్ వేముల యాక్ట్ తెస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయో ప్రశ్నించాలి. యూనివర్సిటీల్లో ఉదారవాద ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు పెంపొందకపోతే అధికారం కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి పిల్లలకే పరిమితమవుతుంది. వర్సిటీలు కేవలం అనుచరులను మాత్రమే కాకుండా, సమర్థవంతమైన నాయకులను తయారు చేసే కేంద్రాలుగా మారాలి" అని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
