హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో సిటీ బస్- తేదీ, రూట్, టైమింగ్స్ ఇవే
హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పని చేస్తోన్న ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఐటీ కారిడార్‌లో వ్యక్తిగత వాహన వినియోగాన్ని కొంతమేరకైనా తగ్గించేలా తక్షణ చర్యలు చేపట్టారు. వ్యక్తిగత వాహన రద్దీని నివారించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే మహిళల కోసం స్పెషల్ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు.
కిందటి నెల 31వ తేదీన ఐటీ కారిడార్‌లో లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఐటీ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మహిళా ఉద్యోగులు సకాలంలో ఇంటికి వెళ్లేలా ఈ ఏర్పాటు చేశారు.

జేఎన్‌టీయూ- వేవ్ రాక్ మధ్య ఈ ఐటీ కారిడార్ లేడీస్ స్పెషల్ బస్సు రాకపోకలు సాగిస్తోంది. ఉదయం 9:05 నిమిషాలకు జేఎన్‌టీయూ వద్ద ఈ బస్సు బయలుదేరుతుంది. మళ్లీ సాయంత్రం 5:50 నిమిషాలకు వేవ్ రాక్ నుంచి జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ బస్సు అందుబాటులోకి రానుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది.
జేఎన్టీయూ నుంచి బయలుదేరే ఈ బస్సు ఫోరమ్/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్/రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చీబౌలి క్రాస్ రోడ్స్, ఇందిరా నగర్, ఐఐఐటీ క్రాస్ రోడ్స్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇప్పుడు తాజాగా- మరో బస్ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నారు. సాధారణ ప్రయాణికులు కూడా ఈ బస్సులో ప్రయాణించవచ్చు.
గాజులరామారం నుంచి వేవ్ రాక్ వరకు ఈ కొత్త సర్వీసు రెండు ట్రిప్పుల్లో రాకపోకలు సాగిస్తుంది. గురువారం ఈ బస్సు రోడ్డెక్కనుంది. ఉదయం 8:40 నిమిషాలకు గాజులరామారం నుంచి బయలుదేరే ఈ బస్సు మహదేవపురం, ఎన్టీఆర్ గార్డెన్స్, యల్లమ్మబండ, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, రహేజా, మైండ్ స్పేస్, బయో డైవర్సిటీ, గచ్చీబౌలి క్రాస్ రోడ్స్, విప్రో మీదుగా వేవ్ రాక్‌కు చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 6:10 నిమిషాలకు వేవ్ రాక్ నుంచి ఇదే మార్గం మీదుగా గాజులరామారానికి చేరుతుంది.












Click it and Unblock the Notifications