తెలంగాణాలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతుంది: ఫలితం ఇలాగే ఉంటుంది!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోరు కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చి మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం రాజకీయ వర్గాలకు అంతు చిక్కకుండా ఉంది.
ఇక ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలో తాజా పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని, డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ప్రజల సమక్షంలో జరగబోతుందని తుమ్మల పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన అజారుద్దీన్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. నిన్న రాత్రి అమీర్ పేట వెస్ట్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కెసిఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అందులో కేసీఆర్ కుటుంబ పాలన జరుగుతోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందని, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజలు రాష్ట్రంలో కెసిఆర్ పాలనపై ఆలోచిస్తున్నారని, అన్ని వర్గాల వారు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ఆ ఫలితం కనిపిస్తుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ పిలుపునిచ్చిన ఆయన ఈ ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును గద్దె దించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్ళీ పొరబాటున కేసీఆర్ కు అధికారంఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, తెలంగాణా భవిష్యత్ ప్రజల చేతిలోనే ఉందని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications