సహకరించండి! రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ జాతీయ రమదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో 2500 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులను నిర్మించిందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందన్నారు.
ప్రస్తుతం రూ. 12,619 కోట్ల వ్యయంతో 691.52 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న లేదా నిర్మించబడుతున్న 16 జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి తన లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం 1,550.529 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 904.097 హెక్టార్ల భూమినే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్వాధీనం చేసిందని.. ఇంకా 646.432 హెక్టార్లు మిగిలిన ఉన్నాయని వెల్లడించారు.

ఇలాంటి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడి.. పారిశ్రామికాభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ చూపి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణాలను గడువులోకా పూర్తి చేసేలా సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా..
భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్రమంత్రి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్టీ ద్వారా భరతమాతకు సేవ చేయడంలో తమ జీవితాలను త్యాగం చేసిన పార్టీ వ్యవస్థాపక సభ్యులకు, కోట్లాదిమంది నిస్వార్థ కార్యకర్తలకు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంతో వినయపూర్వకంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం మొదలుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం వరకు, భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో కష్టపడి పని చేసే తన కార్యకర్తల కృషితో జాతి నిర్మాణ ప్రయాణాన్ని అధిగమించింది. ఎంతో ముఖ్యమైన ఈ వేడుకను పురస్కరించుకుని, వికసితభారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా సంకల్పాన్ని తీసుకుందాం అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications