వరంగల్ లో ఆ జంట ప్రాజెక్ట్ లకు 5 వేల కోట్ల రుణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఓరుగల్లు నగరవాసులకు శుభవార్త. ఓరుగల్లు ప్రజలు చిరకాలం నుంచి ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు మురుగునీటి శుద్ధికరణ కేంద్రాల సేవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. గ్రేటర్ వరంగల్ యూజీడీ, సేవరేజ్ ప్రాజెక్టులకు జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖలు అంగీకారం తెలిపాయి.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం 167వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి డా. టీకే శ్రీదేవి సమర్పించిన వరంగల్ సేవరేజ్, యూజీడీ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను పరిశీలించారు. రూ.5,257 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వరంగల్‌లో అండర్ డ్రైనేజీ, సేవరేజ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి చూపుతున్నారు. పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వరంగల్ యూజీడీ, సేవరేజ్ ప్రాజెక్టుల పనులు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ అమలు చేస్తుంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, సీఈ, వరంగల్ ఎన్ఎఈ అధికారులు పర్యవేక్షిస్తారు. తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ వరంగల్ యూజీడీ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీను వరంగల్, హనుమకొండ నగరాల్లో ఏడు జోన్లుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించారు.
66 డివిజన్లలో ఇన్విటేషన్ టెండర్ స్థాయి పరిశీలన పూర్తయింది. యూజీడీ ఫైనలైజ్ ఏర్పాటు మ్యాపులు సిద్ధం చేశారు. మరో ఏడు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధికరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించారు. ఏడు సేవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో రోజుకు 140-160 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయనున్నారు.
హనుమకొండ, రెడ్డిపురం, కాజీపేట, బంధం చెరువు, విలాపురం వంటి ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. నగరంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఓపెన్ డ్రైన్లు తొలగిపోయి, శుభ్రమైన భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పడితే ప్రజలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది.













Click it and Unblock the Notifications
