బనకచర్ల పేరుతో తెలంగాణాకు మళ్ళీ నీళ్ళ మోసం: కేంద్రం అనుమతి ఇవ్వొద్దు!
బనకచర్ల పేరుతో తెలంగాణ రాష్ట్రానికి తీరని మోసం జరుగుతోందని గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీటి హక్కులు రద్దు అయ్యే ప్రమాదం ఉందని ఇది రాష్ట్రానికి శాశ్వత గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
వృధా జలాల పేరుతో నికర జలాలు తీసుకెళ్తున్నారు
తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో గోదావరి జలాలు బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ కోణం అన్న అంశం పైన హైదరాబాద్ మోజం జాహి మార్కెట్లోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించి కోదండరాం దీనిపైన సుదీర్ఘంగా మేధావులతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి ఈ చర్యతో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. వృధా జలాలను వాడుకుంటున్నామన్న పేరుతో నికర జలాలను తీసుకు వెళుతున్నారని ఆరోపించారు.

గోదావరిలో నీటి వాటా కోల్పోతామని ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి 200 టీఎంసీల నికరజలాలు తీసుకు వెళుతోందని అదనపు జలాల పేరుతో తెలంగాణ పట్ల మోసం జరుగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. తద్వారా గోదావరిలో నీటి వాటాను కోల్పోతామని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని గుర్తు చేశారు.
బనక చర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలపై చర్చ
కృష్ణ గోదావరి నదుల కమిషన్ కౌన్సిల్ ల ద్వారా ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించి సమర్థ చర్యలు చేపట్టాలని కోదండరాం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బనక చర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన సీనియర్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ విశ్లేషణాత్మకమైన వివరణ ఇచ్చారు.
ఇప్పుడు బనకచర్ల హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని బనకచర్ల తో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపి తీరాలని తెలంగాణ రాష్ట్రం లోని నేతలందరూ అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications