Earth quake: మేడారం సమ్మక్క సారలమ్మల సాక్షిగా.. అసలేం జరుగుతుంది!
తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదయింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ తీవ్ర భూప్రకంపం చోటుచేసుకుంది. ములుగు జిల్లా కొండాయి వద్ద భూకంప కేంద్రం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మేడారంలో భయం భయం
దీనివలన గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూప్రకంపనలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు .సుమారు ఉదయం ఏడు గంటల 20 నిమిషాల నుంచి ఏడు గంటల 26 నిమిషాల మధ్య పలుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మేడారంలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవలే మేడారంలో అడవుల్లో సుడిగాలి బీభత్సం
ఇటీవల ములుగు జిల్లాలో టోర్నడో తరహాలో సుడిగాలి బీభత్సం సృష్టించి ఏటూరు నాగారం లోని అటవీ ప్రాంతంలో 50 వేలకు పైగా చెట్లను నేలమట్టం చేసింది. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెట్లు సుడిగాలి దెబ్బకు కూకటి వేళ్లతో సహా పైకి లేచి నేలకొరిగాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇది జరగడం వల్ల అసలు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
మళ్ళీ తీవ్ర భూకంపంతో ప్రజల భయాందోళన
అయితే ప్రజలకు ఎవరికి ఎటువంటి నష్టం జరగకపోవడంతో సమ్మక్క సారలమ్మ తమను రక్షించిందనీ స్థానికులు భావించారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం నమోదైనా, ములుగులో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరోమారు ములుగు వాసుల్లో ఆందోళన మొదలైంది. ములుగు కేంద్రంగా ఈరోజు నమోదైన భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో ములుగువాసులు ఇళ్లల్లో ఉండాలంటే భయపడుతున్నారు.

భూమిలోపల 40 కిలోమీటర్ల నుండి రేడియేషన్
భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి రేడియేషన్ ఉద్భవించిందని అధికారులు చెప్పడం తో ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్లల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. మూడు నుండి ఆరు సెకండ్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకోలేదు.
మేడారం సమ్మక్క సారలమ్మల సాక్షిగా ప్రకృతి ప్రకోపం
అయితే భూకంప తీవ్రత కూడా మేడారంలోనే ఎక్కువగా నమోదు కావడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక మేడారంలో సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద కూడా చోటు చేసుకున్న ప్రకంపనలు భక్తులను ఆందోళనకు గురి చేశాయి. ఎంతో చారిత్రకంగా మహా మహిమాన్వితంగా ప్రశస్థి గాంచిన సమ్మక్క సారలమ్మ ఆలయం కొలువుతీరిన ములుగు జిల్లా మేడారం నుండే ఈ ప్రకృతి ఉపద్రవాలు రావడం పట్ల సర్వత్ర తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications