స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్..!?
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల అమలు పైన సుదీర్ఘ వాదనల తరువాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9న హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో ఆధారంగా జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధిస్తూ నిర్ణయించటంతో... ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల పై ఇప్పుడు ఎన్నికల సంఘం.. ప్రభుత్వం ఏం చేస్తుందనేది కీలకంగా మారుతోంది.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

బీసీ రిజర్వేషన్లపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విలువడిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
ఇదే సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైన ప్రభుత్వం... రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. ఎలాగైనా కోర్టులో గెలుస్తామని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో కోర్టు తీర్పు పైన న్యాయ నిపుణులతో మంత్రులతో చర్చిస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల పైన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం.
అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ పూర్తిగా వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టులో పిటీషన్ల దాఖలు సమయంలో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో.. పిటీషన్ తిరస్కరించింది. ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఏంటనేది ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications