యజమానే దేవుడు; హోలీ నాడు రంగులు పూసి కొబ్బరికాయలు కొట్టి పూజించిన కూలీలు
దేశవ్యాప్తంగా హోలీ పండుగను ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుని ఘనంగా జరుపుకున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా హోలీకి దూరంగా ఉన్న ప్రజలు ఈ సారి జోరుగా హోలీ ఆడారు. కులమతాలకు అతీతంగా, చిన్నాపెద్ద, తరతమ భేదాలు మరచి ఒకరు హోలీ సంబరాలను జరుపుకున్నారు. అటువంటి హోలీ సంబరాలలో ఆసక్తికర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ ఇటుక బట్టీలో హోలీ సంబరాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇటుక బట్టి యజమానిని అక్కడి కూలీలు హోలీ పండుగ రోజున విశేషంగా గౌరవించారు. తమకు పని కల్పించిన ఇటుక బట్టి యజమానిని దేవుడిగా భావించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కూలీలు ఆయనకు పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, అరటి పండ్లు పెట్టి, హోలీ రంగులు పూస్తూ భగవంతుని వద్ద ఎటువంటి భక్తిభావంతో ఉంటారో అలాంటి భక్తిభావం యజమాని పట్ల ప్రదర్శించారు.
హోలీ నాడు రంగులు పూసి కొబ్బరికాయలు కొట్టి పూజించిన కూలీలు pic.twitter.com/tjXT9GSAwj
— oneindiatelugu (@oneindiatelugu) March 19, 2022
ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహబూబాద్ జిల్లాలో వలస కూలీలతో ఇటుక బట్టి యజమాని పూజలందుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇటుక బట్టి యజమాని స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా కావడంతో పార్టీ శ్రేణులలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే యజమానిని దేవుడిగా భావించి పూజలు చేసిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు వారు తమ సాంప్రదాయ పద్ధతిలో హోలీ సంబరాలు జరుపుకున్నామని వెల్లడించారు. తమకు పని కల్పించిన ఇటుక బట్టి యజమాని తాత గణేష్ దేవుడితో సమానం అని వారు చెప్తున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో హోలీ సంబరాలు ఇలాగే ఉంటాయని వారు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications