year ender 2021: రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక సెన్సేషన్; కేసీఆర్ కు ఈటల షాక్
2021 సంవత్సరం టిఆర్ఎస్ పార్టీకి అనేక ఊహించని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఊహించని దెబ్బలు తగిలాయి. అందులో ఒకటి హుజురాబాద్ ఉప ఎన్నిక. హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ నుండి అత్యంత అవమానకరమైన రీతిలో బయటకి వెళ్లి బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ను ఓడించాలని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ విఫలయత్నాలు చేశారు. చివరికి ఈటల రాజేందర్ ముందు గులాబీ అధినేత ఓటమిపాలయ్యారు.

హుజురాబాద్ లో గులాబీ బాస్ కు షాక్
టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిధుల వరద కురిపించి అభివృద్ధి చేసినప్పటికీ, మంత్రులను రంగంలోకి దించి మండలాల వారీగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ ఫలితం ఈటల రాజేందర్ కే పట్టం కట్టింది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికలకు ముందు కేసిఆర్ నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దినా, దళిత బందు వంటి పథకాలతో ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసినా ఈటల రాజేందర్ కే ఓటు వేసి తమ చైతన్యాన్ని చాటారు.

హుజురాబాద్ నేత ఈటల టార్గెట్ గా కేసీఆర్ .. హుజురాబాద్ పై ఫోకస్
జమునా హేచరీస్ కు సంబంధించి అసైన్డ్ భూముల కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అత్యంత అవమానకర రీతిలో మంత్రిగా తొలగించి, పార్టీ నుండి ఈటల బయటకు వెళ్ళేలా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటి నుండి నియోజకవర్గంలో గులాబీ అధినేత చేయని ప్రయత్నాలు లేవు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చేశారు. ఇక దళిత బందు వంటి కొత్త పథకాలను తీసుకొచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇది టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లారు.

నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు పోరాటం
అయితే కెసిఆర్ ఎత్తుగడలను ముందే గుర్తించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి తాను రాజీనామా చేయడం వల్ల జరిగిందని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కెసిఆర్ ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని జోరుగా ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్న డిమాండ్ పెద్దఎత్తున వచ్చింది.
ఇక ఇదే సమయంలో కెసిఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటంగా ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికను అభివర్ణించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈటల రాజేందర్ ను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, బిజెపిని టార్గెట్ చేస్తూ మంత్రులు ఎంత విమర్శలు చేసినా ప్రజలు మాత్రం ఈటెల రాజేందర్ కే అండగా నిలిచారు.

హుజురాబాద్ లో తాగినంత మద్యం, విచ్చలవిడిగా డబ్బులు.. శతవిధాలా ప్రయత్నాలు
హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గం లో మద్యం ఏరులై పారింది. తిన్నవారికి తిన్నంత బిర్యానీ, తాగిన వారికి తగినంత మద్యం, ఓటర్లకు కవర్లలో డబ్బులు ఇలా ఒకటేమిటి ఎన్నికల్లో గెలవడానికి శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి. బీజేపీ నేతలు టీ ఆర్ ఎస్ పార్టీ నేతలపై వందల కోట్ల డబ్బులు పంచుతున్నారు అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ సమయంలోనూ అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సవాళ్లు ప్రతిసవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు, ప్రలోభాల పర్వాల మధ్య సాగిన ఎన్నికలలో ప్రజలు ఊహించని విధంగా టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు గట్టి ఝలక్ ఇచ్చారు.

టీఆర్ఎస్ కు షాక్ .. కేసీఆర్ కు పెద్ద ఝలక్
హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం, విచ్చలవిడిగా ఎన్నిక కోసం చేసిన ఖర్చు టీఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అయింది. ఎన్నికలు వస్తే అభివృద్ధి చేస్తారా లేక పోతే అభివృద్ధి చేయాలనే ప్రశ్న ప్రజలు ఉత్పన్నమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. మరోవైపు రాష్ట్రమంతా హుజురాబాద్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన నేపథ్యంలో హుజురాబాద్ ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా సంచలన తీర్పు ఇచ్చారు. కెసిఆర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చే కంటే కేసీఆర్ కు ప్రతికూలంగా తీర్పునిస్తూ కెసిఆర్ పాలన కు ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని, ప్రభుత్వ పాలన మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని భావించిన హుజురాబాద్ ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు.

గట్టిగా సమాధానం చెప్పిన ఓటర్లు ... కేసీఆర్ అంతర్మధనం
కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏ వ్యూహాలతో ముందు వెళతారో, ఇక నుండి ఆ వ్యూహాలు పారవన్న సంకేతాన్ని హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు ఇచ్చారు.ఇక ఫలితాలు రోజు కొనసాగిన కౌంటింగ్ అన్ని రౌండ్ల లోనూ బీజేపీ తన ఆధిపత్యాన్నికొనసాగించటం ,టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం గులాబీ బాస్ కెసిఆర్ కు గుణపాఠం అనిహుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లోనే కాదు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.
కెసిఆర్ అహంకారాన్ని తగ్గించడం కోసం, ఓటుతోచెంప చెళ్లుమనిపించమనిపిలుపునిచ్చిన బిజెపిహుజురాబాద్ ఆత్మగౌరవ నినాదం బాగా వర్కౌట్ అయ్యింది. భవిష్యత్ ఎన్నికల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, రాష్ట్రంలో పాలన సరిగ్గా లేకపోతే ఓటరు తీర్పు ఎలా ఉంటుందో హుజురాబాద్ తీర్పుతో ఓటర్లు అర్ధం అయ్యేలా చెప్పారు. కేసీఆర్ అంతర్మధనంలో పడేలా చేశారు.












Click it and Unblock the Notifications