'గంజాయి' కారులో ఎంజాయ్ చేసిన డీఎస్పీ సునీల్ కుమార్
అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ ఢీకొట్టిన కారు యజమాని, డీఎస్పీ రాజీపడటంతో కేసు నమోదు కాలేదు.
ఆయన డీఎస్పీ స్థాయి అధికారి. ప్రభుత్వం వాహన సదుపాయం కూడా కల్పిస్తుంది. కానీ గంజాయి కేసులో పట్టుబడ్డ ఓ నిందితుడి కారుపై మోజు పడ్డారు. అందులో కుటుంబ సభ్యులతో కలిసి షికారుకు వెళ్లారు. అంతేకాదు.. అదే కేసులో పట్టుబడిన మరో కారు నెంబరు ప్లేటు తీసి దీనికి పెట్టారు. విశాఖపట్నం బీచ్ లో ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.

ఇద్దరూ రాజీపడ్డారు
అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ ఢీకొట్టిన కారు యజమాని, డీఎస్పీ రాజీపడటంతో కేసు నమోదు కాలేదు. కానీ ఆ వ్యవహారం మొత్తాన్ని అక్కడున్నవారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. గతేడాది జులైలో గంజాయి తరలిస్తున్న నిందితులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలింపునకు ఉపయోగిస్తున్న కారును కూడా వదిలివెళ్లారు. ఆ కారు నెం. ఏపీ31 బీఎన్1116. జి.మాడుగలకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉంది. కశింపేట పోలీసులు ఆ కారును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

విచారణకు కారుతో వచ్చిన సింగ్
జి.మాడుగులలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తోన్న రాజస్థాన్ కు చెందిన సింగ్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ కోసం పిలిపించారు. సింగ్ ను అరెస్ట్ చేయగా, తాను వేసుకొచ్చిన కారును తన తల్లికి అందజేయాలని కోరారు. అప్పటికే ఆమె రాజస్థాన్ కు వెళ్లిపోవడంతో అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అప్పటినుంచి పోలీసులు తమ అవసరాలకు ఆ కారునే వాడుకుంటున్నారు.
ఈనెల ఒకటోతేదీన డీఎస్పీ సునీల్ ఆ కారు తీసుకొని విశాఖ బీచ్ కు వెళ్లారు. డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడిన నిందితుడి కారులో ప్రయాణించినట్లు తమ దృష్టికి వచ్చిందని, సొంతానికి వాడుకోవడం ఒక నేరం కాగా, నెంబరు ప్లేటు మార్చి మరో నేరం చేశారని, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని అనకాపల్లి ఎస్పీ గౌతమి తెలిపారు.

పలు వివాదాల్లో డీఎస్పీ సునీల్
డీఎస్పీ సునీల్‌పై గతంలోనూ వివాదాలున్నాయి. సివిల్ కేసుల్లో తలదూరుస్తారని, భూవివాదాలు సెటిల్‌మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉండటంతోపాటు కశింకోటకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాయల మురళిని ఫోన్‌లో బెదిరించారు.
ఈ విషయాన్ని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎస్పీ గౌతమికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దానిపై కూడా విచారణ జరుగుతోంది. తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారు పంపారని, అంతకుమించి తనకేమీ తెలవదని సునీల్ అంటున్నారు.












Click it and Unblock the Notifications