Warangal wonder Kid:మిస్సైల్ టెక్నాలజీలో సైంటిస్టులకే సవాల్ విసురుతున్న కుర్రాడు
వరంగల్ జిల్లాకు చెందిన పదమూడేళ్ల వండర్ కిడ్ తోటపల్లి శివ కుమార్ మిస్సైల్, రాకెట్లు తయారీ టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. క్షిపణులు, రాకెట్లు మరియు నానో టెక్నాలజీ కి సంబంధించిన అంశాలలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల మన్ననలు పొందిన తోటపల్లి శివ కుమార్ నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన వివిధ రాకెట్ మోడల్ లపై తన డిజైన్స్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలతో పంచుకున్నాడు. తన టెక్నాలజీతో వారిని సైతం ఆశ్చర్యపరిచారు.
ఆ గురువు కోసం కదిలొచ్చిన గ్రామం .. కాళ్ళు కడిగి, పూజలు చేసి భుజాలపై ఊరేగించి ఘనంగా వీడ్కోలు సంబరం

శాస్త్ర సాంకేతిక విషయాల్లో అద్భుత ప్రతిభ చూపిస్తున్న వరంగల్ కుర్రాడు
తోటపల్లి శివ కుమార్ కు చిన్నప్పటినుండి శాస్త్ర పరిశోధన అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఆసక్తి అతడిని కొత్తపుంతలు తొక్కించిన ఆలోచనల వైపు మళ్లించింది. వినూత్నమైన ఐడియాలతో, కొత్త కాన్సెప్ట్ లను రూపొందిస్తూ అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నారు తోటపల్లి శివ కుమార్. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులను కలిశారు. వారి మన్ననలు పొందాడు. వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోటపల్లి శివ కుమార్ చిన్నవయసులోనే అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. తన వినూత్న ఆలోచనలతో శాస్త్రవేత్తల నుండి అనేక పురస్కారాలను అందుకున్నారు.

ఇప్పటివరకు మూడు వందల పతకాలు ,ధృవ పత్రాలు .. పలువురు ప్రముఖుల ప్రశంసలు
ఇప్పటివరకు మూడు వందల పతకాలను, ధృవ పత్రాలను పొందాడు.
విజయాల జాబితాలో యుఎన్ఓ, యు ఎన్ ఐ టి ఏ ఆర్, ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ, యు ఎన్ డి పి, యుఎన్ఓ పర్యావరణం, యు ఎన్ ఆర్ ఈ డిడీ ప్రోగ్రామ్, యూఎన్ఆర్ఈడిడి ప్లస్ అకాడమీ మరియు O పేజ్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ నుండి ధృవీకరణ పత్రాలు పొందాడు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుండి ధృవీకరణ పత్రాన్ని పొందిన శివ కుమార్, భారతదేశంలో గతంలో జరిగిన జాతీయ యువ శాస్త్రవేత్తల సదస్సులో అతి పిన్న వయస్కుడిగా పాల్గొన్నాడు.

3 డి క్షిపణిపై పరిశోధనలు జరుపుతున్న శివకుమార్ .. డీఆర్డీఓ కి పంపిన మోడల్స్
అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ లో ప్రధానితో సంభాషించే అవకాశం వచ్చింది.
నానోటెక్నాలజీ నుండి ప్రేరణ పొందిన శివ కుమార్ 3 డి క్షిపణిపై పరిశోధనలు ప్రారంభించాడు . అంతే కాదు అతను తన భావనను డిఆర్డిఓకి పంపాడు, దానిని వారు ఆమోదించారు. అంతేకాకుండా, తక్కువ ఇంధన వినియోగంతో వేగంగా ప్రయాణించే సుదూర క్షిపణులను తయారు చేయాలన్న శివ కుమార్ ప్రతిపాదనను ఇస్రో శాస్త్రవేత్తలు సైతం మెచ్చుకున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభను ఇస్రో డైరెక్టర్ స్వయంగా ప్రశంసించారు.

చెస్ లోనూ ప్రపంచ స్థాయి ఆటగాడు .. యూత్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
అంతేకాదు చెస్ లోనూ ప్రపంచ స్థాయి ఆటగాడిగా శివకుమార్ గుర్తింపు పొందాడు. సూపర్ గ్రాండ్ మాస్టర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ నుండి ప్రశంసలను అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆటల పట్ల, శాస్త్ర సాంకేతిక విషయాలు పట్ల తనకు ఉన్న అభిరుచితో తాను ఇదంతా చేయగలుగుతున్నా అని తోటపల్లి శివ కుమార్ చెబుతున్నాడు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి యూత్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు తోటపల్లి శివ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు.