వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టెక్సాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, సెప్టెంబర్ 20వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన నిర్వహించారు.

ప్రవాసంలో నిరాటంకంగా 98 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి వచ్చి, జయప్రదం చేసారు. జొన్నవిత్తుల రచించిన 'చెక్కెర కలిపిన తీయని కమ్మని' గేయాన్ని శ్రీమతి ఓంకారి నిఖిత మధురంగా ఆలపించగా సభ ప్రారంభమైంది.

ధీరులు నిరపేక్షులు, ఆదరమొప్ప మ్రొక్కెడుదు, ఒనరన్ నన్నయ తిక్కనాది కవుల్, మరియు లలిత స్కంధము అనే పోతన పద్యాలను భావయుక్తంగా పాడి, చిన్నారులు యషస్వి కర్రి, సంహిత మాడ, మరియు నిర్జర దొడ్ల పద్యాలకు అర్ధాలను కూడా సందర్భోచితంగా వివరించారు.

అత్తలూరి రాజేశ్వర రావు తెలుగు సినిమాలో తెలుగు సాహిత్యం గురించి మాట్లాడి తెలుగు భాష ఫై మక్కువను తెలియచేసారు. శ్రీమతి బల్లూరి ఉమాదేవి 'శ్రీ కృష్ణ దేవరాయలు కవితా వైభవం' స్వీయ కవిత ఆహూతుల మన్ననలు పొందింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, డా. తోటకూర ప్రసాద్ అక్కినేని వ్యక్తిత్వాన్ని, జ్ఞాపకాలను, మధురస్మృతులను సభతో పంచుకున్నారు.

చేవూరి చంద్రశేఖర్ రెడ్డి స్వీయ కవిత సభను ఆకట్టుకుంది. మద్దుకూరి చంద్రహాస్ 'ఎవరు' అంశం ఫై వ్యక్తిత్వాన్ని, రచనలను, సాహిత్యాన్ని ప్రస్తావించి, ఆ వ్యక్తి 'శ్రీ ఆదిభట్ల నారాయణదాసు' అని ఆహూతులనుండి రాబాట్టిన సరళి కొత్త అనుభూతిని కలిగించింది.

వరిగొండ శ్యాం సెప్టెంబర్ మాసంలో జన్మించిన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, కవి శ్రీ గుర్రం జాషువా, ప్రజాకవి శ్రీ కాలోజి నారాయణ తెలుగు భాష, సాహిత్యానికి చేసిన సేవలను ప్రస్తావించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

ముఖ్య అతిధి శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారు వృత్తిరీత్యా సాంకేతికరంగంలో రాణిస్తూనే, బాల్యంలో హిందీ సాహిత్యం పరిచయంతో కథలు, నాటకాల పై ఆసక్తి పెంపొందించుకొని, సాహిత్యాభిలాషతో, తెలుగు భాష పై అభిమానంతో 60కి పైగా కథలు, నవలలు, 20కి పైగా నాటకాలు రచించి, అమెరికా జీవితాన్ని "డయాస్పోరా" కథల ద్వారా అక్షరబద్ధం చేస్తున్న కథకులు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

చారిత్రక నవలలు ‘యథార్ధచక్రం', ‘నేహల', సాంఘిక నవల ‘అంతర్జ్వలి', ‘సరిహద్దు' కథా సంపుటి, కోనసీమ కథలతో పాఠకుల మన్ననలు పొందారు. ప్రవాసంలో 25 సంవత్సరాలుగా తెలుగు భాష,సాహిత్యానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగిస్తున్నారు. శ్రీ సాయి బ్రహ్మానందం గారు "సాహిత్యం లో ప్రక్రియలు - కథ, నవల, నాటకం" అను అంశం మీద మాట్లాడుతూ, సాహిత్యంలో వివిధ రకములు ఉన్నాయి అని, ఆలోచనా అమృతాలు పంచేవి, సమాజం మనుషులు గురించి తెలియపరిచేవి, జీవితానికి ఉల్లాసం కలిగించేవి ఇలా ఎన్నో రకాల సాహిత్య ప్రక్రియలు ఉన్నట్లు చెప్పారు.

 ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

ముందుగా నాటక ప్రక్రియ గురించి మాట్లాడుతూ, మనకు క్రీస్తు పూర్వం నుండి సంస్కృత నాటకాలు ఉన్నాయి అని, వాటికి సిద్ధాంత కర్తలు పతంజలి అని చెప్పారు. అలాగే భరతముని నాట్య శాస్త్రం గురించి ప్రస్తావించారు. సంస్కృత నాటక కర్తలలో ప్రసిద్ధులు అయిన అశ్వఘోషుడు, భాసుడు, కాళిదాసు, దండి, శూద్రకుడు మున్నగు వారిని ప్రస్తుతించారు. నాటకము ఎలా ఉండాలి అనే విషయం గురించి సోదాహరణంగా వివరించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

నాటక నిర్దేశకాలు గురించి మాట్లాడుతూ, కథా వస్తువు, కథనం, నటీనటులు, రంగస్థల ఆహార్యం, సంధాతల యొక్క ఆవశ్యకతను వివరించారు. నాటకానికి ఊపిరి సంభాషణలు, అందులో విరుపులు, వ్యంగ్యాలు, ఎత్తిపొడుపులు, హాస్యాలు, కోపాలు, తాపాలు, నాటకానికి ప్రథానం అని గుర్తు చేసారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

తెలుగులో ప్రసిద్ధ నాటకాలు గురించి మాట్లాడుతూ, కన్యాశుల్కం, వరవిక్రయం, చింతామణి, నిజం, పావలా, మరో మొహంజదారో, కళ్ళు, కుక్క, గుండెలు మార్చబడును వంటి సుప్రసిద్ధ నాటికలను మనం ఎన్నటికీ మర్చిపోలేము అని ఆర్థ్రత నిండిన కంఠంతో పలికారు. తదుపరి నవలల గురించి మాట్లాడుతూ నవల అంటే "జీవితంలో పలు ముఖాల సాహిత్య ప్రతిబింబమే నవల, కవిత్వం మీద వచనం చేసిన మొదటి తిరుగుబాటు నవల" అని ఆశక్తి తో వివరించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

నవలలో కథ పూల దండలో దారం వంటిదని, పూలు సంఘటనలు అని, పాత్రలు పూల రంగులు, పరిమళం అని తెలిపారు. నాయకుడు మేలు చేసే వాడు, ప్రతినాయకుడు దుర్మార్గుడు, చెడ్డవాడు, నాయిక అందం, ఆకర్షణ, తెలివితేటలు కలిగిన సౌందర్యరాశి అని తెలిపారు. ప్రముఖ నవలలు గురించి చెబుతూ కందుకూరి వీరేశలింగం గారు వ్రాసిన రాజశేఖర చరితము, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వేయిపడగలు, చలం గారు వ్రాసిన మైదానం, ఇంకా రంగనాయకమ్మ రాసిన లేఖా నవల కృష్ణవేణి, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, నవీన్ గారు వ్రాసిన అంపశయ్య, ఇలా ఎన్నో ప్రముఖ నవలలు గురించి ప్రస్తావించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

కథ ఎలావుండాలో మాట్లాడుతూ "కథ ఒక అనుభవం, దృశ్యం, సంఘటన కావొచ్చు అని చెప్పారు. ఇలా నాటకం, నవల, కథ ఎలా ఉంటే జనరంజకంగా ఉంటాయో ఎన్నో చక్కటి ఉదాహరణ లతో వివరించి ఆహూతుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ దీపావళి వేడుకలు నవంబరు 14న ఇర్వింగ్ హై స్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు"100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 21న ఘనంగా జరుపడానికి ప్రణాళిక సిద్ధమయిందని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండినరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు, పూర్వాధ్యక్షులు కాకర్ల విజయ మోహన్, సమన్వయకర్త దండ వెంకట్, సాహిత్య వేదిక సభ్యులు ముఖ్య అతిథి శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారిని జ్ఞాపిక తో సత్కరించారు.

ఘనంగా టాంటెక్స్

ఘనంగా టాంటెక్స్ "నెల నెలా తెలుగు వెన్నెల"

దండ వెంకట్ మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారం తో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Kids singing at 98th Nela Nela Telugu Vennela sponsored by Telugu Association of North Texas (TANTEX) on Sunday,September 20, 2015 at Desiplaza Studio,Irving,Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X