అదానీ కీలక ప్రాజెక్ట్.. ధారావిలో 10,432 పునరావాస ఫ్లాట్ల నిర్మాణం..!!
ముంబైలోని ప్రసిద్ధ ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాటుంగాలోని 22 ఎకరాల రైల్వే స్థలంలో పునరావాస గృహాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావి వాసులకు సురక్షితమైన, ఆధునిక వసతులతో కూడిన గృహాలను అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
అదానీ నవభారత్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బృహత్తర ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. దీని కింద మొత్తం 10 భారీ టవర్లను నిర్మించనున్నారు. వీటి ద్వారా అర్హులైన ధారావి నివాసితులకు 350 చదరపు అడుగుల వైశాల్యం గల 10,432 పునరావాస ఫ్లాట్లను అందించనున్నారు. వీటితో పాటు వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం 1,379 ప్రత్యేక యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. సెక్టర్ 1, సెక్టర్ 6 ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

దశలవారీగా గృహాల అందజేత.. 2030 నాటికి పూర్తి
ఈ ప్రాజెక్ట్ పనులను మొత్తం మూడు దశల్లో పూర్తి చేసి, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ అధారిటీకి అప్పగిస్తారు. మొదటి దశలో భాగంగా 2029 మార్చి నాటికి తొలి ఐదు టవర్లను పూర్తి చేస్తారు. అనంతరం 2029 ఆగస్టు నాటికి మరో రెండు టవర్లు, చివరి దశలో 2030 ఆగస్టు నాటికి మిగిలిన మూడు టవర్లను సిద్ధం చేస్తారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అసీమ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్మించబోయే ఒక్కో టవర్ 37 నుంచి 39 అంతస్తుల ఎత్తులో ఉండనుంది. ప్రయాణికుల రాకపోకల కోసం ప్రతి టవర్‌లో 10 నుంచి 12 లిఫ్టులు, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు రెండు ప్రత్యేక ఫైర్ ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నివాసితుల సౌకర్యార్థం కిండర్‌గార్టెన్, కమ్యూనిటీ హాల్, పోడియం గార్డెన్లు, ప్రార్థనా మందిరాలు మరియు బహిరంగ విశ్రాంతి స్థలాలను సమకూర్చనున్నారు. వ్యాపార యూనిట్లకు కూడా వేరుగా లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలు.. పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు
ఈ భవనాలు మరియు మౌలిక వసతుల దీర్ఘకాలిక నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పునరావాస భవనాల్లోని వ్యాపార స్థలాల్లో 10 శాతాన్ని కేటాయించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉమ్మడి వసతుల పర్యవేక్షణకు ఉపయోగిస్తారు. ఇళ్లు అప్పగించిన నాటి నుంచి మొదటి పదేళ్లపాటు భవనాల నిర్వహణ బాధ్యతలను అదానీ నవభారత్ సంస్థే చూసుకుంటుంది. ధారావి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తమ ప్రాథమిక బాధ్యత అని ప్రణవ్ అదానీ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు భాగస్వాములయ్యారు. అమెరికాకు చెందిన ససాకి, బ్రిటన్‌కు చెందిన బ్యూరో హాపోల్డ్, సింగపూర్ పట్టణ ప్రణాళిక నిపుణులతో పాటు ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సేవలను వినియోగించుకుంటున్నారు. పాఠశాలలు, వైద్య కేంద్రాలు, ఉద్యానవనాలు, రవాణా వసతులు కేవలం 15 నిమిషాల కాలినడక దూరంలోనే లభించేలా ఒక సమగ్రమైన టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధారావి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడ నివాసితులు రాబోయే మోడల్ గృహాలను, 3డి విజువల్స్ ద్వారా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. ఇప్పుడు భూమిపూజతో ప్రత్యక్ష నిర్మాణం ప్రారంభం కావడంతో, లక్షలాది మంది ధారావి ప్రజల సొంతింటి కల సాకారమయ్యే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications
