వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సాహిత్యం- అమెరికా 'ఆట'

By Staff
|
Google Oneindia TeluguNews

మార్చి 11, 2002.
ఉదయం 11 గంటలు

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్జాన కేంద్రం మినీ హాల్‌.

అమెరికాకు, ఆంధ్రదేశానికి మధ్య సాహితీ వారధి కోసం ప్రయత్నం. అమెరికా తెలుగు అసోయేషన్‌ (ఆటా) సభ్యుడు, అమెరికా భారతి సంపాదకుడు మురళీ చందూరీతో తెలుగు సాహితీవేత్తల ఇష్టాగోష్ఠీ. దాదాపు నలభై మంది తెలుగు రచయితలు ఇందులో పాలు పంచుకున్నారు.

'వార్త' దిన పత్రిక ఆదివారం ప్రత్యేక సంచిక ఇన్‌ఛార్జి, కథా విమర్శకుడు గుడిపాటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనే మురళీ చందూరికి, తెలుగు సాహితీ వేత్తలకు మధ్య సమావేశంలో వారధిగా నిలిచారు.

తెలుగు సాహిత్యంపై అమెరికాలోని తెలుగువారు కర్రపెత్తనం చెలాయించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవల కొంత కాలంగా ఇక్కడి సాహిత్యకారులు మండిపడుతున్నారు. 'ఆటా' అవార్డు పొందిన చంద్రలత 'రేగడివిత్తులు' నవలను తెలంగాణ ప్రాంత రచయితలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఈ విషయాల మీదే మురళీ చందూరీని హైదరాబాద్‌లోని తెలుగు సాహితీవేత్తలు నిలదీశారు. చర్చ చాలా వరకు ఈ విషయాల మీదనే కేంద్రీకృతమైంది.

మక్కువ తగ్గలేదు మురళీ చందూరీ మొదట చిన్నపాటి ప్రసంగం చేశారు. తాము చాలా ఏళ్ల క్రితం అమెరికా వెళ్లామని, అయితే ఆంధ్రప్రదేశ్‌ మీద, తెలుగువారి మీద తమకు ప్రేమ తరగలేదని, తెలుగు సాహిత్యంపై మక్కువ తగ్గలేదని, ఇందులో భాగంగానే 'తానా', 'ఆటా' లాంటి సాంస్కృతిక, సాహిత్య సంస్థలను నడుపుతున్నామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో మార్పులకు అయన బాధపడ్డారు. అడుగడుగునా గుళ్లు రావడం ఆయనకు ఏ మాత్రం రుచించలేదు. ''నా చిన్నతనంలో హైదరాబాద్‌ ఇలా వుండేది కాదు. ఇప్పుడు అడుగడుగునా గుడులు, కాషాయ వస్త్రాలు కనిపిస్తున్నాయి. ఇది నాకు నచ్చడం లేదు. అమెరికాలోని తెలుగువాళ్లూ ఇంతే. అమెరికాలోని తెలుగువాళ్లు తెలియని దేవుళ్లను అమెరికావాళ్లకు పరిచయం చేస్తున్నారు. అనవసరంగా పూజలకు, వ్రతాలకు సమయం వెచ్చిస్తున్నారు. ఇది నాకు చాలా చిరాకు కలిగిస్తోంది'' అని ఆయన తన కడుపులో బాధను చెప్పుకున్నారు.

ఒక్క శాతమే...అమెరికాలోని తెలుగువాళ్లలో ఒక శాతం మంది మాత్రమే సాహిత్యం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, సాహిత్యాభిరుచి వున్నవారందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నవే ప్రస్తుత సంస్థలని ఆయన చెప్పారు.

అవార్డు రాజకీయాలు లేవు తాము ఇక్కడి రచనలకు బహుమతులు ఇవ్వడం వెనుకు రాజకీయాలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. తాము ప్రోత్సహిస్తే ఇక్కడి వారు మరింత ఉత్సాహంగా సీరియస్‌ సాహిత్యం సృష్టిస్తారనేదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. అవార్డులో విషయంలో తాము అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని, అయినా తాము ఈ కార్యక్రమాలను ఆపబోమని ఆయన చెప్పారు.

తమకు ఇతరేతర ఉద్దేశాలేవీ లేవన్న మురళీ చందూరీ మాటలను పట్టుకున్నారు విప్లవ రచయిల సంఘం (విరసం) సభ్యుడు ఎన్‌. వేణుగోపాల్‌. 'ఏ ఉద్దేశ్యాలు లేనప్పుడు ఆంధ్రదేశంలోని ఒక ప్రాంతం సాహిత్యాన్నే మీరు ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నారు? మరో ప్రాంతం సాహిత్యాన్ని, ప్రజలను, సంస్కృతిని కించ పరిచే రచయితలకు, వారి రచనలకు ఎందుకు బహుమతులు ఇస్తున్నారు?' అని ఆయన అడిగారు. అలా చేస్తున్నారని చెప్పడానికి చంద్రలత రాసిన 'రేగడి విత్తులు' నవలకు బహుమతి ఇవ్వడాన్ని ఎత్తి చూపారు. 'రేగడివిత్తులు' నవల తెలంగాణ ప్రజలను, వ్యవసాయ రంగాన్ని, భాషను, సంస్కృతిని దారుణంగా కించపరిచింది; అవమానపరిచింది. దానికి మీరు అవార్డు ఇచ్చారు. ఇలా చేయడంలో మీ బాధ్యత ఏదీ లేదా? మీ సమాధం ఏమిటి?'' అని వేణుగోపాల్‌ నిక్కచ్చిగా అన్నారు.

శైలినే చూశాం 'ఆ నవలకు అవార్డు ఇచ్చే సందర్భంలో శైలినే ప్రధానంగా చూశాం. ప్రాంత పరమైన అవమానాన్ని గుర్తించలేకపోయాం. అందులో నా తప్పేమీ లేదు' అని మురళీ చందూరీ సమర్థించుకోవడానికి ప్రయత్నించారు.

'అవమానించేదీ మీరే, ఆ అవమానాలకు కనీసం బాధ్యత వహించకుండా చేసినదాన్ని సమర్థించుకుంటున్నారు. ఇది సమంజసమేనా?' అని వేణుగోపాల్‌ అన్నారు. వేణుగోపాల్‌తో మరింత మంది సాహిత్యవేత్తలు గొంతు కలిపారు. 'రేగడి విత్తులు' నవలను ప్రోత్సహించడం పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, కథా రచయితలు డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్‌ ననుమాస స్వామి అభ్యంతరాలు తెలియజేశారు.

ప్రముఖ కవి ప్రసేన్‌ మరో అడుగు ముందుకు వేసి- 'ఇక్కడి పరిస్థితులు, సాహిత్యం మీకు తెలియకపోతే బహుమతులు ఇవ్వడం మానేయండి. అంతేగాని- ఇక్కడి ప్రజల సంస్కృతిని, సాహిత్యాన్ని అవమాన పరిచే హక్కు మీకు లేదు. ఇది మా మాటగా అమెరికాలో స్థిరపడి సాహిత్య రాజకీయాలు నడుపుతున్న తెలుగువారందరికీ చెప్పండి' అని మురళీ చందూరీతో అన్నారు.

న్యాయనిర్ణేతలదే బాధ్యత 'రేగడి విత్తులు' నవలకు బహుమతి ఇవ్వడంలో ఉద్దేశపూర్వకమైన తప్పేమీ తాము చేయలేదని మురళీ చందూరీ చెప్పారు. 'న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్టు ఎ.బి.కె. ప్రసాద్‌, రచయిత్రి ఓల్గా, ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు రేగడి విత్తులు నవలను బహుమతికి ఎంపిక చేశారు. ఎంపిక తర్వాత బహుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దాంతో జరిగిన పొరపాటును దిద్దుకోలేకపోయాం. తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని అవమానపరచడం మా అభిమతం కాదు. దానికి న్యాయనిర్ణేతలే కొంత బాధ్యత వహించాల్సి వుంటుంది' అని ఆయన వివరించారు.

దానికి ప్రముఖ సాహితీ విమర్శకుడు కె. శ్రీనివాస్‌ ఘాటుగా ప్రతిస్పందించారు. 'న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఓల్గా లాంటి రచయితలు ఇప్పటికీ సమాజంలో, సాహిత్యంలో ఉన్‌ వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి, చేసింది తప్పుడు నిర్ణయమని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. పైగా రేగడివిత్తులు నవల మీద చాలా దారుణంగా, క్రూరంగా విమర్శలు చేశారని ఓల్గా తప్పు పట్టారు. వారి అవమానాలను మేం సహించాలి కానీ మా సహేతుకు విమర్శలను మీరు గానీ, న్యాయనిర్ణేతలు గానీ అంగీకరించరు. మా బాధను ఎందుకు లెక్కలోకి తీసుకోరు?' అని ఆయన అన్నారు.

రేగడివిత్తులను వదిలేద్దాం ఒక 'రేగడి విత్తులు' నవల మీదనే చర్చంతా జరపడం ఆపేద్దామని మురళీ చందూరీ అన్నారు. రాయలసీమ, తెలంగాణల నుంచి వచ్చిన మంచి నవలలకు తాము బహుమతులు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

దాంతో వేణుగోపాల్‌ సంతృప్తి చెందలేదు. 'మీకు మా ప్రాంతం మీద, మా రచనల మీద చిన్నచూపు వుంది. మీరు డబ్బులు ప్రేరణగా రచనలను ప్రోత్సహిస్తూ, దాతలుగా వ్యవహరిస్తూ ఈ మట్టి నుంచి, ఈ సంస్కృతి నుంచి నుంచి వస్తున్న సాహిత్యాన్ని అవమానపరుస్తున్నారు. అందుకు మీరు నిజంగా బాధపడుతున్నట్లయితే ఇక్కడి ప్రజలను క్షమాపణలు అడగాలి' అని ఆయన అన్నారు.

దీనికి మురళీ చందూరీ నొచ్చుకున్నట్లే ఉన్నారు. 'దాతలు అనే పదం వాడి మీరే మమ్మల్ని అవమాన పరుస్తున్నారు. అమూల్యమైన రచనలు అందించే మీరే దాతలు. మేం స్వీకరిస్తాం' అని ఆయన అన్నారు.

వేలూరి తీరు నాకూ నచ్చలేదు అమెరికాకు వ్యతిరేకంగా సాహిత్య సృష్టి చేస్తే తమను ప్రవాసాంధ్రులు బిన్‌ లాడెన్‌ను చూసినట్లు చూస్తున్నారని తెలుగు ముస్లిం రచయితలు యాకూబ్‌, స్కైబాబ అన్నారు. 'ముస్లిం టెర్రరిస్టు రైటర్స్‌ అని, వికృత రూపాలు అని మమ్మల్ని అవమాన పరుస్తున్నారు' అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేలూరి వేంకటేశ్వరరావు వంటి వారి వైఖరి ఏమిటని, మీ వైఖరి ఏమిటని వారు అడిగారు.

దానికి మురళీ చందూర్‌ ప్రతిస్పందిస్తూ- 'వేలూరి లాంటివారు అతి స్పందించడం, తీవ్ర పదజాలం వాడడం నాకూ నచ్చలేదు. దానికి మేం బాధ్యులం కాము' అని చెప్పుకున్నారు.

ముందు, ముందు ప్రజాస్వామిక పద్ధతిలో రచనలను ఎంపిక చేస్తామని హామీ ఇవ్వగలరా అని నేను అడిగినప్పుడు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించారు. కొందరి మాటలు విని కాకుండా ఇక్కడి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ కవి నగ్నముని మురళీ చందూర్‌కు సలహా ఇచ్చారు. 'మీకు ఏ మాత్రం మానసిక సంస్కారం ఉన్నా అక్కడి తెలుగు ప్రజలకు మా బాధ వివరించండి' అని జయధీర్‌ తిరుమలరావు అన్నారు.

శ్రీనివాస్‌కు మాత్రం నమ్మకం కుదరలేదు. పరిస్థితి మారుతుందనే ఆశ కనిపించినట్లు లేదు. అందుకేనేమో- 'అందరూ కోస్తావారే అయినప్పుడు తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని ఎలా ప్రేమిస్తారు? మీరు ప్రేమించలేరు. ఇది జరగని పని' అని అన్నారు.

పుస్తకాలొద్దు, లగేజీ ప్రాబ్లమ్‌ వుంటుంది వేడి వేడి విసుర్లతో చర్చ రెండు గంటల పాటు సాగింది. అయితే, ఇక్కడ రచయితలు చాలా మంది తమ పుస్తకాలను మురళీ చందూరీ చేతుల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. కవులు, రచయితలు, తమ కవితా సంపుటులను, నవలలను ఇవ్వడానికి చూపిన ఉత్సాహం చూస్తే అమెరికా ఆంధ్రుల కడగంటి చూపు కోసం మన వారెంత ముఖం వాచి వున్నారా అని బాధేసింది.

'ఇన్ని పుస్తకాలు వద్దండి, ప్లేన్‌లో లగేజీ ప్రాబ్లమ్‌ వుంటుంది' అని మురళీ చందూరీ సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది. మన కవుల, రచయితల స్థితి చూసి నాకు కాస్తా దిగులు కూడా వేసింది. ఈ ఇష్టాగోష్ఠిలో ఇంకా బోయ జంగయ్య, హెచ్చార్కె, కుప్పిలి పద్మ, ఎస్‌.జయ, నాళేశ్వరం శంకరం, షాజహానా, ఒమ్మి రమేష్‌ బాబు, కందుకూరి దుర్గా ప్రసాద్‌, తమ్మనబోయిన వాసు, తదితరులు పాల్గొన్నారు.

మొత్తానికి, ఈ ఇష్టాగోష్ఠి హైదరాబాద్‌ నగరంలో ఒక కొత్త అనుభూతిని, అనుభవాన్ని మిగిలించింది. గ్రూప్‌ ఫొటోలతో, కరచాలనాలతో వాతావరణం చివరగా చల్లబడింది. అమెరికా తెలుగువారి వద్ద తమ భావోద్వేగాలను వెల్లడించే అవకాశం ఇక్కడి రచయితలకు వచ్చింది. మొహమాటాలు లేకుండా తమ ఉద్వేగాలను, అభ్యంతరాలను ఇక్కడి రచయితలు వెల్లడించడం ఒక రకంగా విశేషమే!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X