వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత్వ భాష- ఆధునికత

By Pratap
|
Google Oneindia TeluguNews

Modernity and Poetic Language
కేవలం పదజాలం కూర్పు కవిత్వం కాదు. భాషను కవిత్వంగా మార్చే ప్రక్రియ సృజనాత్మకతకు సంబంధించింది. ఈ మర్మం తెలిసినవారే మంచి కవిత్వం రాయగలరు. భాషను తన కవిత్వావసరాలకు అనుగుణంగా వాడుకోగలిగే సామర్థ్యం ఉన్నవారే పాఠకులను సృష్టించుకోగలరు. వస్తువేదైనా వ్యక్తీకరణ వ్యాకరణం (గ్రామర్‌) అంతర్గతంగా ఒక దారంలా కొనసాగడానికి పదజాలం పని చేస్తూ వుంటుంది. వచన కవిత్వం ఆధునిక ప్రక్రియ అయినందున కవికి పాత పదబంధాలు, పాత పదజాలం సరిపోదు. కొత్త విషయాలను, ఆధునిక పరిణామాలను, వాటి ప్రభావాలను మాట్లాడదలుచుకున్నప్పుడు, దాన్ని బలంగా వ్యక్తీకరించాలనుకున్నప్పుడు కవి కొత్త డిక్షన్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తీకరణ వ్యాకరణాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత ప్రయత్నం వల్ల జరగవచ్చు. సాధారణంగా కవిత్వ మర్మం తెలిసిన కవులకు ఆ స్పృహ లేకుండానే ఆ పని జరిగిపోతూ ఉంటుంది.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాహిత్య, సాంస్కృతిక రంగంలో వేళ్లూనుకుంటూ ప్రస్తుత తరుణంలో తెలంగాణ భాషా స్పృహ కూడా బలంగా వ్యక్తమవుతున్నది. ఆ కారణంగా కవిత్వంలో తెలంగాణ భాష వాడకం ఒక విధమైన ఎరుకతో జరుగుతున్నది. డాక్టర్‌ దేవరాజు మహారాజు 'గుడిసె- గుండె', పంచరెడ్డి లక్ష్మణ 'ఇసిత్రం', భాను 'ఊరోల్లు', టి. కృష్ణమూర్తి యాదవ్‌ 'తొక్కుడబండ' తెలంగాణ మాండలికంలో వచ్చిన కవితా సంపుటాలు. పూర్తి మాండలికంలో వచ్చిన కవితా సంపుటులు గానీ, అప్పుడప్పుడు వచ్చిన, ఇప్పుడు వస్తున్న పూర్తి తెలంగాణ మాండలిక వచన కవిత్వం గానీ సారంలో మౌఖిక సంప్రదాయానికి చెందిందే. పాటలో విస్తృత స్థాయిలో ఉండే సామూహిక లక్షణం కొంత పరిమితితో మాండలిక వచన కవిత్వంలో ఉంటుంది. ఈ మౌఖిక సంప్రదాయం ఈ కవిత్వానికి ఒక గుణం.

వివిధ సామాజిక శ్రేణులు తమ మూలాలను వెతుక్కునే క్రమంలో వచన కవిత్వాన్ని తమ వ్యక్తీకరణకు సాధనంగా ఎంచుకున్నప్పుడు తెలంగాణ భాష మరో రకంగా వ్యక్తమవుతుంది. ముందే అనుకున్నట్లు వచన కవిత్వం ఆధునిక ప్రక్రియ. చదువుకున్నవారి వ్యవహారం. దాని రచన, పఠనం, అనుభవం సామూహికమైంది కాదు. కవి వెల్లడించిన అనుభవాలను, అనుభూతులను పఠనం ద్వారా పాఠకుడు ఒంటరిగానైనా గ్రహించి అనుభవిస్తాడు. ఈ క్రమంలో తెలంగాణలో దళిత వచన కవిత్వం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తున్నది. వేముల ఎల్లయ్య, గ్యార యాదయ్య తమ అనుభవాలను, వెతలను, అనుభూతులను తమ భాషలో వ్యక్తీకరిస్తున్నారు; వ్యక్తీకరించారు. వచన కవిత్వానికి సంబంధించిన ఆధునిక వ్యక్తీకరణ వ్యాకరణాన్ని వారు రూపొందించుకున్నారు. ఆ రకంగా వారు వచన కవిత్వంలో పరిణతిని సాధించారు. ఈ కోవలో చిత్రం ప్రసాద్‌ బలమైన కవి. 'బహువచనం' కవుల్లోనూ, 'మేమే' కవుల్లోనూ ఈ లక్షణం బలంగా కనిపిస్తుంది. అంటే వచన కవిత్వాన్ని తమ ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచడంలో వీరు విజయం సాధించారన్న మాట. వచన కవిత్వంలో దళిత ఈస్తటిక్స్‌కు వీరు బలమైన పునాది వేయగలిగారు.

ఈ ప్రత్యేకతలను పక్కన పెడితే- ఆధునిక పరిణామాలకు, అనుభవాలకు, పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ భాషను, అభివ్యక్తి గుణాన్ని ఇమిడ్చుకుని వచన కవిత్వానికి సారళ్యాన్ని అందించిన కవులు ఉన్నారు. తెలంగాణ పదజాలంతో ఒక కొత్త డిక్షన్‌ను తయారు చేసుకుని కొత్త కవిత్వ నిర్మాణ పద్ధతులను వీరు తయారు చేసుకున్నారు. కొత్త డిక్షన్‌ను తయారు చేసుకుని తెలంగాణ వచనకవిత్వానికి ఆధునిక, నాగరిక లక్షణాలను సంతరించి పెడుతున్నారు. ఆధునిక అనుభవాలను, అనుభూతులను కవిత్వీకరించే విషయంలో పాఠ్యపుస్తకాల భాషను (కోస్తాంధ్ర శిష్ట వ్యవహారికాన్ని) స్వీకరించి చాలా మంది తెలంగాణ కవులు కూడా వచన కవిత్వాన్ని వెలువరిస్తూ వస్తున్న కాలంలోనే వీళ్లు దాన్ని తృణీకరించి తమదైన కవిత్వ వ్యాకరణాన్ని తయారు చేసుకున్నారు. తెలంగాణలో ఆధునిక నాగరికత లక్షణాన్ని వీరు ప్రతిఫలిస్తున్నారు. ఆ రకంగా తెలంగాణ భాషకు ఒక గౌరవాన్ని, అందరి ఆమోదాన్ని సంతరించి పెడుతున్నారు. ఈ కవిత్వం ఆ రకంగా స్థానీయ మూలాలను, సంస్కృతిని, జీవన విధానాన్ని వ్యక్తం చేసేందుకు ఒక కొత్త డిక్షన్‌ను తయారు చేసుకుంది. ఎన్‌. గోపి తన కవితా సంకలనానికి 'తంగెడు పూలు' అని పేరు పెట్టడం ఈ రకమైందే. స్థానీయ వాసనలతో ఆధునిక, నాగరిక మానవుడి అవసరాలకు అనుగుణమైన తెలంగాణ వ్యక్తీకరణ రూపుదిద్దుకుంటున్నదనే విషయాన్ని ఈ కవిత్వం తెలియజేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ కవిత్వం తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకోవడమే కాకుండా తెలుగు కవిత్వానికి కొత్త డిక్షన్‌ను అందించింది. అంటే వీరు ఆధునిక తెలంగాణ వచన కవిత్వ భాషను రూపొందించారు; రూపొందిస్తున్నారు.

వస్తువేదైనా సరే అతి సులభంగా, సహజంగా తెలంగాణ పదజాలం, నానుడులతో పూర్తి ఆధునిక వచన కవిత్వాన్ని కొంత మంది వెలువరిస్తూ వస్తున్నారు. ఇది వారికి అనివార్యమైంది కూడా. నందిని సిద్ధారెడ్డి, జూకంటి జగన్నాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ విషయంలో విజయం సాధించారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాహిత్య, సాంస్కృతిక రంగంలో వేళ్లూనుకోక ముందు నుంచే వీరు ఆ పని చేస్తూ వస్తున్నారు. సిద్ధారెడ్డి 'భూమి స్వప్నం', 'సంభాషణ', 'ఒక్క బాధా కాదు' నుంచి ఇప్పటి వరకు వెలువరించిన కవితా సంపుటలన్నింటిలో ఈ లక్షణం కవనిపిస్తుంది. విప్లవ వచన కవిత్వంలో సిద్ధారెడ్డి ప్రత్యేకత అది. అందువల్లనే వచన కవిత్వంలో ఆయన ఒక బలమైన కవిగా నిలబడగలిగారు. ఆ కృషి కాస్తా ఎక్కువగా చేస్తున్నవారు జూకంటి జగన్నాథం. ఈ కవి తన కవితా సంపుటులకు పేరు పెట్టుకోవడం దగ్గరి నుంచి ఈ స్పృహను ప్రదర్శిస్తున్నారు. 'పాతాళగరిగె', 'గంగడోలు', 'బొడ్డుతాడు' అంటూ తన కవితా సంపుటాలకు పేర్లు పెట్టుకోవడం ద్వారా ఆయన ఈ ప్రత్యేకతను ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. తెలంగాణ మూలాలకు, సంస్కృతికి, జీవన విధానానికి నాగరిక లక్షణాన్ని ఆపాదించి పెడుతూ సర్వామోద యోగ్యమైన డిక్షన్‌ను అలవరుచుకున్నారు. గ్లోబలైజేషన్‌ గురించి రాసిన 'వాస్కోడిగామా డాట్‌ కామ్‌' దీర్ఘ కవితలో కూడా ఆయన తెలంగాణ పదజాలాన్ని సమర్థంగా వాడుకున్నాడు. ఈ విషయాన్ని గమనిస్తే ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పదజాలాన్ని వాడుకోవడంలో ఆయన సాధించిన పరిణతి అర్థమవుతుంది. ఈ క్రమంలోనే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'దాలి', ఎం. వెంకట్‌ 'వర్జి' దీర్ఘ కవితల్లో దీన్ని సాధించారు. బాధలను, కన్నీళ్లను, సంప్రదాయాలను కవిత్వంలో వ్యక్తీకరించాల్సి వచ్చినప్పుడు పదజాలం సరిపోక పడే తండ్లాట నుంచి వీరు బయటపడ్డారు. తెలంగాణ భాషను, యాసను పూర్తిగా వాడలేని నిస్సహయత నుంచి బయటపడుతూ తెలంగాణ పదజాలంతో కొత్త వాక్యాలను, ఆధునిక అభివ్యక్తిని తెలంగాణ ఆధునిక వచన కవులు సాధించగలిగారు.

వచన కవిత్వంలో ఈ కొత్త వ్యక్తీకరణ వ్యాకరణం గ్రామాలను వదిలిపెట్టి, చదువుకుని, ఆధునిక జీవన విధానంలో పడిపోయిన కవులకు సరైన దిశను నిర్దేశించింది. తమ గ్రామీణ ప్రజల, తమ తాతముత్తాతల, తలిదండ్రుల భాషను నెమరేసుకుంటూ దానికి శిష్ట సంప్రదాయాన్ని అద్దుతున్నారు. భాష భాష కోసం కాదు, మాండలికంలో రాసినంత మాత్రాన అది కవిత్వమై పోదు. ఆ భాషను కవిత్వ భాషగా మార్చుకోవడంలోనే కవి ప్రతిభ, గొప్పదనం ఉంటుంది. తెలంగాణ భాషను ఆ రకంగా వాడుకోడంలో ఈ కవులు ఫలితాలు సాధిస్తున్నారు. అల్లం నారాయణ 'యాది-మనాది', కాసుల ప్రతాపరెడ్డి 'గుక్క' దీర్ఘ కవితలు కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. డాక్టర్‌ పులిపాటి గురుస్వామి, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్‌, అయిల సైదాచారి, ఎస్‌. జగన్‌ రెడ్డి తెలంగాణ అభివ్యక్తిని అందుకుని బలమైన కవిత్వం వెలువరిస్తున్నారు.

'నా బాల్యం బాలశిక్షలో దాచుకున్న నెమలికన్ను' అని అన్నవరం దేవేందర్‌ అనడం కేవలం భాషకు, అనుభూతికి, అనుభవానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆధునిక వినిమయ వస్తు సంస్కృతి వల్ల ఇప్పటి పిల్లలు కోల్పోతున్న వైనాన్ని చెప్పే క్రమంలో తన బాల్యంలోని అనుభవాన్ని చెప్పడం ద్వారా పాఠకులకు గొప్ప అనుభవాన్ని మనసులో చిత్రిక కడుతున్నాడు. ఆధునిక తెలంగాణ కవిత్వ పరిభాష అది. ఇది విస్తరిస్తూ పోవడం తెలుగు కవిత్వం సాధించిన విజయం.

-కాసుల ప్రతాపరెడ్డి

English summary
Poets will change the language in their poetry according to their expression in modern society. Nandini Sidha Reddy, allam Narayana, Sunkirerddy Narayana Reddy used the language to express their modern ideas successfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X