ఉరికొయ్య మీద ప్రజాస్వామ్యం

అత్మీయులకు చివరిచూపులు దక్క నీయకుండా
చెరసాల చీకట్లలో రహస్యంగా చంపేశారు
పత్రికలకు గుట్టు చప్పుడు చేయకుండా
చట్టం ముసుగు లో మనిషి ప్రాణాన్ని తీసేశారు
ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే దేశంలో
న్యాయవాది లేకుండానే న్యాయవిచారణ జరుగుతుంది
ప్రత్యక్ష సాక్ష్యాలు లేకుండానే నేరం రుజువు అవుతుంది
జనం ఆవేశాన్ని చల్లార్చటానికి ఉరి తీయాలిసిందేనని కోర్టులు తీర్పు ఇస్తాయి
నల్లకోటు న్యాయస్థానంలో న్యాయం ఎంత గుడ్డిది అయ్యింది
జీవించే హక్కును నిరాకరిస్తూ
శవాలను సైతం మాయం చేస్తారు
జైలులోనే గొయ్యి తీసి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తారు
ఓట్ల రాజకీయం కోసం చావు నాటకాన్నివేసి
పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని ఉరికంభం పైన పరిహస్తారు
రామరాజ్యమంటూ రాక్షసపాలన సాగిస్తారు
వందేమాతరం, వందేమాతరం అంటూ
వంద ముక్కలుగా నరకుతారు
వందేమాతరం, వందేమాతరం అంటూ
మైనార్టీలను, దళితులను, ఆదివాసులను చీల్చిచెండాడుతారు
వందేమాతరం, వందేమాతరం అంటూ
తలలు నరికి దేశభక్తిని చాటుతారు
మతోన్మాదపు ఆనందం లో పరవశిస్తూ
మిఠాయిలు పంచి చావును పండగ చేస్తారు
మెజారిటీ ఓట్లను దండుకోవటానికి మైనార్టీలను ఉరితీస్తారు
ప్రజాస్వామ్యం ముసుగులో
మధ్యయుగపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు
ప్రజాస్వామిక సమాజంలో
శిక్ష అంటే పగ కాదు, ప్రతీకారంకాదు
కన్నుకు కన్ను తీయటం కాదు
న్యాయం పేరుతో
మనిషి ప్రాణాలు తీయటం సమంజసం కాదు
శిక్ష నేరస్తుడిని మార్చాలి
సమాజంలో నేరాన్నినివారించాలి
వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పాలి
కాశ్మీరులో ఒక మఖ్బూల్ భట్ట్ , ఒక అఫజల్ గురును ఉరితీస్తే
వెయ్యి మంది యువకులు బందూకులు ఎత్తుతారు
కాశ్మీరులో లక్షమంది కాల్చిచంపితే
ప్రజాస్వామ్యం పైన నమ్మకాన్ని కోల్పోతారు
తలల పైన తుపాకులు ఎక్కుపెట్టి సైనిక పాలన సాగిస్తే
మమ్మల్ని వదిలేయండి
మా బతుకు మేము స్వతంత్రంగా బతుకుతాం అంటారు
కాశ్మీరులో హసీనా, సలీమా, సాజా
తల్లిని చెల్లిని, కూతురుని కోడలిని
సోపియాన్‌లో, కునాన్ పోషుపురాలో, హరాన్‌లో
భారత సైనికులు మానభంగాలకు పాల్పడితే
ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తుంది
కాశ్మీరు లో ప్రజాస్వామ్యాన్ని నడిబాజారు లో అత్యాచారం చేస్తే
పోరాటం తప్ప వేరే మార్గం లేదంటారు
చివరికి ఆజాద్ కాశ్మీర్ కావాలంటారు
మీరు ఉరిశిక్షను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?
న్యాయం పేరుతో మనిషి ప్రాణాలను తీయటం అంగీకరిస్తారా?
మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను ఆచరించే సభ్యసమాజంలో జీవిస్తారా?
పగతో ప్రతీకారంతో, ద్వేషంతో ఉన్మాదంతో కుంచించుకు పోతారా?
కళ్ళముందు దుర్మార్గాలను మౌనంగా తమాషా చూస్తారా?
-సాజీ గోపాల్












Click it and Unblock the Notifications