తెలుగు కవిత 'ఎవరో పిలిచినట్టే..!'

దారంట పోయేవారిని అడుగుతూ ఉంటారు
కలవాల్సివారికంటే కలవనివారే యిష్టం
వెతుక్కుంటూనే ఉంటారు తెలియనివారికోసం
దారి తిప్పినా, తాను తిరిగినా.. మలుపులోకి వెళ్లినా..
కొలిచిన దారంతా మర్చిపోయి, అడ్రస్ మరిచి
తెలిసీతెలియనివారితో జ్ఞాపకాలు కలబోసుకుని
తెలిసినట్టే జాగ్రత్తలు చెప్పి, చెబుతూనే
తెలియనిమార్గంలోకి వడి వడిగా వెళుతూంటారు
తెలుసుకునేసరికి కాలం చెల్లిందని
కొత్తదారి వేస్తున్నారని ప్లకార్డులు ఎదురవుతాయి
సందిగ్ధ చౌరస్తాలో దిగబడతాయి కాళ్లు
మనసులోకి దూరి ప్రయాణ ప్రారంభాన్ని
కొలిపించిన మార్గాన్ని అన్వేషించే యత్నం..!
మారిన జనం వెక్కిరిస్తారు,
మనసు పొరల్లో మనిషి హత్యచేసుకుంటాడు
సభ, నాలుగుమాటలు, ఒక ఫోటోలతో
వాడి గది తలుపులు వేసేస్తారు!
- టి. లలితా ప్రసాద్












Click it and Unblock the Notifications