కవిస్వరం: అతనొక మరణం లేని మనిషి
ఇటీవలి కాలంలో వస్తున్న కవులకు సామాజిక స్పృహ ఉండడం లేదనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సమాజంలో ఏం జరుగుతుందో, పక్కవాడికి ఏమవుతోందో పట్టించుకోనితనం పెరిగిపోయిందనే భావన బలంగా ప్రచారంలో ఉంది. అయితే, యువ కవులు, ఇటీవలి కవులా చాలా మంది దానికి అపవాదుగా కవిత్వం రాస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆ ప్రచారం తెలియజేస్తోంది. కవిత్వ వాహికకు సంబంధించిన మాధ్యమాలు మారాయనే విషయాన్ని కూడా చాలా మంది గుర్తించడం లేదు.
ఇంటర్నెట్, ఫేస్‌బుక్ వంటివి కవిత్వవాహికలుగా, యువకవులు స్పందనలకు ఆలవాలంగా మారాయి. కవిసంగమంలో ఈ వారం జాస్తి రామకృష్ణ చౌదరి రాసిన అతనొక మరణం లేని మనిషి అనే కవిత ఆ విషయాన్ని తెలియజేస్తోంది. అభివ్యక్తిలో కొత్త ఒరవడి కూడా ప్రారంభమైందని ఈ కవితా శీర్షికను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.
ఈ కవిత అత్యంత సృజనాత్మకంగా ప్రారంభమవుతుంది. మధ్యలోకి వచ్చేసరికి వాచ్యమైపోయింది. కొన్ని సందర్భంగాల్లో కొన్ని సంఘటనలకు ప్రతీకలను ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడు వాచ్యమైనా అది తన ధర్మాన్ని నెరవేరుస్తుంది. జాస్తి రామకృష్ణ చౌదరి కవిత ఆ ధర్మాన్ని నెరవేరుస్తుంది. కవిత ముగింపులో కూడా ఊహాశక్తి, భావనాబలం కనిపిస్తుంది. మధ్యలోని వచనప్రాయమైన వాచ్యతను పోగొట్టుకోవడానికి మననం అవసరం. గుండె పగిలి లావా ఎగిజిమ్మినట్లు కవితా పాదాలు బయటకు రావాలి. అది కొంత అభ్యాసం వల్ల, కొంత మననం వల్ల జాస్తి రామకృష్ణ చౌదరికి తప్పకుండా అలవాటు అవుతుందని నా నమ్మకం.
- కాసుల ప్రతాపరెడ్డి

ప్రపంచం అంతా సమస్యే కదా
అదే కదా తను చెప్పింది
అది నిజమే కదా
"మనుషులే యుద్దాలు చేస్తారు"
అని చెప్పాడు తను
అవును మరి - అది యదార్ధమే కదా
మనుషులే కదా యుద్దాలు చేయాలి;
యుద్దం అంటే అధర్మం మీద తిరుగుబాటు కదా
ఆ యుద్దం దెయ్యాలు చేయవు కదా
మరి ఆ దెయ్యాలే అవి నమ్ముకున్న మతం కోసం
అధర్మయుద్దం చేస్తున్నాయి కదా
అదే కదా అతను చెప్పింది కూడా
అది సత్యమే కదా;
ఒక అంకితభావం కలిగిన విలేఖరిగా
ఒక మనసు కలిగిన మనిషిగా
సిరియాలో జరుగుతున్న ఘోరాల్ని
కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ
ప్రపంచం అంతరాత్మని మేలుకొలపడానికి
ప్రయత్నం చేశాడు తను
అతనొక సాహసవీరుడు;
కానీ అతని తల నరికి చంపి
వారు గొప్ప ఘనకార్యం చేసినట్టు
ఆ దృశ్యాన్ని చిత్రీకరించి వీడియోలో
పెట్టి ప్రపంచానికి చూపించింది
నశిస్తున్న మానవత్వానికి తార్కాణంగా
ఆ రాక్షస వ్యవస్థ;
అతని తల్లి -
నా కడుపున
ఒక మంచి పుత్రుడు
ఒక మంచి సోదరుడు
ఒక గొప్ప విలేఖరి
అన్నిటికి మించి
ఒక మంచి మనిషి
ఒక గొప్ప మానవతావాది జన్మించాడని
ఎంతగానో గర్వపడుతోంది
ఎంత విశాల హృదయం తనది;
అటువంటి భయంకరమైన ప్రదేశాలకి
అతను ఎందుకు వెళ్ళడం అని అడిగితే
అది అతని కర్తవ్యం
అని అతని తండ్రి అన్నాడంటే
ఆ తండ్రిది ఎంత గొప్ప దృక్పధమో తెలుస్తుంది
తను ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో తెలియదు
ఎన్ని చిత్రహింసలు భరించాడో తెలియదు
ప్రక్క ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోని
ప్రపంచం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన
ఒక త్యాగమూర్తి తను
ఒక పరాక్రమశాలి తను
ఎవరు ఎక్కడకి వెళ్లడానికి ఇష్టపడరో
భయపడతారో
అక్కడికే వెళ్ళడం అతనికి ఇష్టం
అది కష్టమైనా సరే - ప్రపంచం కోసం;
సిరియా కోసం అక్కడ జరుగుతున్న బీభత్సమైన
యుద్దంలో మరణిస్తున్న జనాల కోసం
వారి బాధని ప్రపంచానికి చూపించడం కోసం
ప్రపంచ జనుల దేశాల కళ్ళు తెరిపించడం కోసం
సమాచారాన్ని అందిస్తూ
తన మహా ప్రస్థానంలో
అసువులు బాసిన మాహా మనిషి అతను
అతని తల నరికి చంపిన దృశ్యాన్ని
మంగళవారం వీడియో లో పెట్టారు మీరు
మీరు నరికింది ఒక గొంతుకని మాత్రమే
మీరు నరికినా తెగని స్వరం అది
తనొక మరణం లేని శక్తి
అదెప్పుడూ ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది;
ఇక్కడ చనిపోయింది ఎవరు -
బ్రతికి ఉన్నది ఎవరు?
మీ అంతరాత్మని అడగండి - మీకే తెలుస్తుంది
మీ దేవుడి కోసం మీరు చేస్తున్న అఘాయిత్యాల్ని
చూస్తూ దుఖపడుతున్న దేవుడి కోసం
మరో దేవుడ్ని నమ్మి పూజించే
మనుషులని అలా అతిక్రూరంగా చంపేస్తారా
దేవుళ్ళనే యుద్దం చేసుకోనివ్వండి!
మీరెందుకు పాపం మూట కట్టుకుంటారు?
మీరేందుకు అమాయకుల ప్రాణాల్ని బలిగొంటారు?
ఈ ఉన్మాదం ఇంతటితో అంతం కావాలి
ఇప్పుడు ప్రతీ మనిషి ఒక తరంగమై
ఉవ్వెత్తున లేచే మహా సముద్రం కావాలి
ఈ ప్రపంచాన్ని ముంచేస్తున్న ఈ అకృత్యపు
యుద్ద మహమ్మారిని అంతం చేయాలి!
ఓ మిత్రమా......
ఇదిగో నీ కోసం నా రెండు కన్నీటి చుక్కలు
అవే నేను నీకు సమర్పించే
పుష్పగుచ్చాలు!
జాస్తి రామకృష్ణ చౌదరి
2014, ఆగస్టు 22
JAMES FOLEY అనే అమెరికా విలేఖరిని ISIS అనే ఇస్లామిక్ మతోన్మాద సంస్థ ISIS క్రూరంగా తల నరికి చంపిన దృశ్యాన్ని మంగళవారం అంటే 19.8.2014 నాడు నెట్ లో పెట్టిన సందర్భంగా అతనికి శ్రద్దాంజలి ఘటిస్తూ!












Click it and Unblock the Notifications