Viral Video: వైట్‌హౌస్‌లో ట్రంప్- జెలెన్‌స్కీ కొట్టుకున్నారట- ఏఐ అగ్రహారంలో టాక్..!!
Donald Trump and Zelensky: మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించట్లేదనేది వైట్‌హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్‌స్కీ. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.

అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ- వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్‌స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు.
ఫలితంగా- ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున ట్రంప్ వాదిస్తోన్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. మధ్యవర్తిగా రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్నారనే వాదనను వినిపించారు.
ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్‌స్కీ.. వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. చర్చల మధ్యలో నుంచే వెళ్లిపోయినందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు.
కాగా- ఈ గొడవకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసిన ఓ క్లిప్ అది. డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా జెలెన్‌స్కీ తన కుర్చీ నుంచి లేచి నిల్చొని ఘర్షణకు దిగడం ఇందులో కనిపించింది.
Who made this edit? 🤣 pic.twitter.com/RzFCGpgRJE
— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) February 28, 2025
డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలకు ఆగ్రహంతో ఒక్క ఉదుటన లేచి ఆయనపై ఎగబడటం, చేతులు పట్టుకుని కిందికి లాగడం ఇందులో చూడొచ్చు. షాక్‌కు గురైన ట్రంప్ ప్రతిఘటించారు. జెలెన్‌స్కీని వెనక్కి తోసివేశారు. పక్కనే కూర్చునివున్న జేడీ వాన్స్ జోక్యం చేసుకుంటోండటం, వారిని వారించడానికి ప్రయత్నించడాన్ని ఏఐతో జనరేట్ చేశారు.












Click it and Unblock the Notifications