అంతరిక్షంలో అంతుచిక్కని బ్రహ్మపదార్థం: వేగం గంటకు 16 లక్షల కిలోమీటర్లు.. భూమి వైపు
NASA: అంతరిక్షం..అద్భుతాలమయం. పరిశోధించే కొద్దీ- కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తి రేపుతుంది. ఎక్కడో పాలపుంతలకు అవతల సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం, కృష్ణబిలాలు వెలుగులోకి రావడం, తొక్కచుక్కలు, గ్రహశకలాలు భూమికి చేరువగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఉత్కంఠతకు గురి చేసేవే.
అద్భుతం దృశ్యం..
విశ్వాంతరాల్లో జీవజాలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు సాగిస్తోన్న పరిశోధనలు సాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతూనే ఉంటాయి. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా టెలిస్కోప్ కంటికి ఓ అద్భుత దృశ్యం చిక్కింది.

మిలియన్ మైళ్ల వేగం..
గెలాక్సీకి అవతల చక్కర్లు కొడుతున్న ఓ అంతుచిక్కని ఖగోళ వస్తువును గుర్తించారు నాసా ఆధ్వర్యంలో పని చేసే ఓ ముగ్గురు అమెచ్యుర్ సైంటిస్టులు. దీని వేగం- గంటకు మిలియన్ మైళ్లు. ఒక వస్తువు ఇంత వేగంతో అంతరిక్షంలో తిరుగుతోండటం ఇదే తొలిసారిగా భావిస్తోన్నారు. ఇది- ఓ నక్షత్రానికి సమానమైన లేదా అంతకంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగివుండటం దీని ప్రత్యేకత.
సీవైజ్ ఆబ్జెక్ట్..
ఈ ఆబ్జెక్ట్‌కు సీవైజ్ జే124909 (CWISE J124909) అని పేరు పెట్టారు. నాసా పర్యవేక్షణలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తోన్న బ్యాక్‌యార్డ్ వరల్డ్స్: ప్లానెట్ 9 ప్రాజెక్ట్‌లో పని చేసే ముగ్గురు అమెచ్యుర్, సిటిజన్ సైంటిస్టులు మార్టిన్ కబాట్నిక్, థామస్ పీ బికెల్, డాన్ సెసెల్డెన్ దీన్ని గుర్తించారు.
వైజ్ టెలిస్కోప్..
హవాయ్‌లో నాసా ఏర్పాటు చేసిన విలియం మైరాన్ కెక్ అబ్జర్వేటరీ, వైడ్ ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ టెలిస్కోప్ ఆర్బిటర్ సహాయంతో దీన్ని గుర్తించారు. పాలపుంతకు అవతల సంభవించే పరిణామాలు, కొత్త నక్షత్రాలు, గెలాక్సీలను పసిగట్టడానికి నాసా ఈ వైజ్ టెలిస్కోప్‌ను 2009 డిసెంబర్ 14వ తేదీన ప్రయోగించింది.
చివరి ప్రాజెక్ట్..
2013లో దీన్ని మరింత అప్‌గ్రేడ్ చేసింది నాసా. నియోవైజ్ (నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్- ఫీల్డ్)గా మార్చింది. ఇప్పటికే అనేక గ్రహశకలాలు, తోకచుక్కలను పసిగట్టింది. వాటి సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్‌కు పంపించింది. ఇప్పుడు తాజాగా సీవైజ్ జే124909ను గుర్తించిందీ టెలిస్కోప్. ఆగస్టు 8వ తేదీన ఈ టెలిస్కోప్ సేవలు నిలిచిపోవడానికి ముందు దీన్ని ఐడెంటిఫై చేసింది.
కోర్ హైడ్రోజన్
సీవైజ్ జే124909 ఆబ్జెక్ట్.. గంటకు మిలియన్ మైళ్ల వేగంతో పాలపుంత చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు మార్టిన్ కబాట్నిక్ చెప్పారు. దాని కోర్‌లో హైడ్రోజన్‌ను పుష్కలంగా ఉందని, వాయువులతో నిండివున్న గెలాక్సీ లేదా నక్షత్రాల మధ్య ఎక్కడో తిరుగుతోందని వివరించారు.
4,000కు పైగా..
ఇప్పటివరకు బ్యాక్‌యార్డ్ వరల్డ్స్: ప్లానెట్ 9 ద్వారా నాలుగు వేలకు పైగా ఖగోళ వస్తువులను గుర్తించామని, అవన్నీ కూడా పాలపుంత మధ్యే తిరుగుతుంటాయని మార్టిన్ వివరించారు. సీవైజ్ వస్తువు మాత్రం గెలాక్సీ అవతల మిలియన్ మైళ్ల వేగంతో తిరుగుతోండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని పేర్కొన్నారు.
ఎందుకంత వేగం..
ఈ వస్తువు ఎందుకు అంత వేగంతో ఎందుకు కదులుతోందనే విషయంపై అధ్యయనం చేస్తోన్నామని మార్టిన్ తెలిపారు. ఒక నక్షత్రం.. బ్లాక్ హోల్ బైనరీని ఎదుర్కొన్నప్పుడు, గ్లోబులర్ క్లస్టర్ నుంచి బయటకు వెళ్లే సమయంలోనే మాత్రమే అంత వేగం సాధ్యపడుతుందని శాన్ డియాగో యూనివర్శిటీ ఖగోళ- భౌతిక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కైల్ క్రీమెర్ చెప్పారు.












Click it and Unblock the Notifications