పూంపుహార్: కడలి కడుపులో దాగివున్న చోళుల వైభవం.. ప్రళయం మింగేసిన మహానగరం.
తమిళనాడు తీరంలో శతాబ్దాల కిందట సముద్ర గర్భంలో కలిసిపోయిన పురాతన ఓడరేవు నగరం 'పూంపుహార్' మళ్లీ వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు చోళ రాజుల ప్రధాన వ్యాపార కేంద్రంగా, అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి గుండెకాయగా విరాజిల్లిన ఈ నగరం ఉన్నట్టుండి సముద్రంలో మునిగిపోయింది. తమిళ ప్రాచీన సంగమ సాహిత్యంలో 'కావేరి పూంపట్టినం'గా పిలువబడిన ఈ నగరపు ఆనవాళ్లను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సముద్ర గర్భంలో సాగించిన శోధనలో చోళుల నాటి విదేశీ వాణిజ్య సంబంధాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.
సముద్రంలో నాటి ఆనవాళ్లు.. పశ్చిమాసియా పాత్రల తునకలు
తమిళనాడు పురావస్తు శాఖ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ సంయుక్తంగా సముద్రంలో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తృత శోధనలు నిర్వహించాయి. ఈ తవ్వకాల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందినవిగా భావిస్తున్న "టార్పెడో జార్" ముక్కలు, నాలుగు మట్టి రింగుల బావులు (టెర్రకోట రింగ్ వెల్స్, 250కి పైగా ప్రాచీన పింగాణీ తునకలు లభించాయి. ఈ ఆధారాల ద్వారా నాటి చోళులు ఆగ్నేయాసియా, శ్రీలంకతో పాటు పశ్చిమ దేశాలు, గ్రీక్, రోమన్ నాగరికతలతో ఎంతటి భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహించేవారో స్పష్టమవుతోంది.

ప్రాచీన సాహిత్యం చెప్పిన సత్యాలే నిజమవుతున్నాయా?
తమిళ ప్రాచీన గ్రంథాలైన 'పట్టిణప్పాలై', 'శిలప్పదిగారం', బౌద్ధ కావ్యం 'మణిమేఖలై'లలో పూంపుహార్ నగరం గురించి అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. కావేరీ నది సముద్రంలో కలిసే చోట నిర్మితమైన ఈ ఓడరేవు నగరంలో ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది వర్తకులు, విదేశీయులు నివసించేవారని ఆ గ్రంథాలు పేర్కొన్నాయి. ఆ కాలంలో రాసిన సాహిత్య వర్ణనలు కేవలం కల్పనలు కావని, నిజంగానే అదొక మహానగరమని ఇప్పుడు సముద్ర గర్భంలో లభిస్తున్న మట్టి పాత్రలు, రింగు బావులు రుజువు చేస్తున్నాయి.
ఆ మహానగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది?
పూంపుహార్ నగరం ఎలా అంతరించిపోయిందనే దానిపై భిన్నమైన కథనాలు ఉన్నాయి. కావేరీ నది తన మార్గాన్ని మార్చుకోవడం, తీరప్రాంతం సముద్రంలో కలిసిపోవడంతో పాటు దాదాపు 1,500 ఏళ్ల కిందట సంభవించిన ఒక ప్రళయకరమైన సునామీ వల్ల ఈ నగరం మునిగిపోయి ఉండవచ్చని పురావస్తు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బౌద్ధ గ్రంథం మణిమేఖలై ప్రకారం, చోళ రాజు వార్షిక ఇంద్ర ఉత్సవాలను నిర్వహించకపోవడం వల్ల దైవ ఆగ్రహానికి గురై నగరాన్ని సముద్రం మింగేసిందనే ప్రచారం కూడా ఉంది. శాస్త్రవేత్తలు మాత్రం భూభౌతిక మార్పులు, సునామీల వల్లే ఈ విపత్తు జరిగిందని భావిస్తున్నారు.
పరిశోధనల్లో కొత్త మలుపు.. శాస్త్రవేత్తల ఆసక్తి
సముద్ర గర్భంలో ఇప్పుడు లభించిన మట్టి రింగుల బావులు నాటి నదీ ప్రవాహ మార్గాలను సూచిస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఆవిష్కారాలు కేవలం పురాతన వస్తువులను వెలికితీయడమే కాకుండా, శతాబ్దాల కాలంలో తీరప్రాంతాల్లో వచ్చిన మార్పులను, కావేరీ నది ప్రవాహ పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. తమిళనాడు తీరం తన కడుపులో దాచుకున్న ఈ హిస్టారికల్ రహస్యాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను వెలికితీసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
