Elon Musk: ట్రంప్ గెలుపుతో మస్క్ మామకు మైండ్ బ్లోయింగ్ షాక్.. ఊహించని ఎదురుదెబ్బతో బిజినెస్ పాయే
Bluesky: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఈ సంగ్రామంలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే US అంతటా ఆయన గెలుపు గురించి వివాదాలు చెలరేగుతున్నాయి. ట్రంప్ గెలుపునకు మీరే కారణం అంటూ కొందరు మహిళలు ఇప్పటికే పురుషులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఆగ్రహం కాస్తా ఎలాన్ మస్క్ మెడకు చుట్టుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధిపతిగా కూడా ఎంపికయ్యారు. కానీ అలా మద్ధతు ఇవ్వడమే ఇప్పుడు మస్క్‌కు శాపంగా మారుతోంది. ట్రంప్ గెలుపు పట్ల గుర్రుగా ఉన్న చాలా మంది అమెరికన్లు మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X నుంచి క్రమంగా దూరం అవుతూ, ప్రత్యామ్నాయాలకు మారడం ప్రారంభించారు.

ఇలాంటి X యూజర్లకు 'బ్లూస్కై' అతిపెద్ద డెస్టినేషన్‌గా అవతరించింది. ఈ సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యూజర్స్‌ను ఆకర్షిస్తూ వేగంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజూ దాదాపు ఒక మిలియన్ కొత్త వినియోగదారులు యాడ్ అవుతున్నారు. ప్రస్తుతం దీని యూజర్ బేస్ 16.7 మిలియన్లు కాగా ఆ సంఖ్య పెరుగుతూ పోతోంది.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే ట్విట్టర్‌ని సృష్టించిన జాక్ డోర్సే బ్లూస్కైకి ప్రాణం పోశారు. X మాదిరిగానే సెర్చ్ బార్, నోటిఫికేషన్‌లు మరియు రీపోస్టింగ్ వంటి పలు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్విట్టర్‌కు భిన్నమైన డిజైన్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. వినియోగదారులు తమ డేటాను కంపెనీ నియంత్రణలో లేని సర్వర్‌లలో హోస్ట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. X మాదిరిగా కాకుండా బ్లూస్కై సంప్రదాయ ప్రకటనలకు దూరంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు కూడా బ్లూస్కై హవాను మరింత పెంచారు. గాయకుడు లిజ్జో, నటుడు బెన్ స్టిల్లర్, నటి జామీ లీ కర్టిస్ మరియు హాస్యనటుడు పాటన్ ఓస్వాల్ట్ వంటి వ్యక్తులు ఈ వేదికలో చేరారు. కొందరు X నుంచి పూర్తిగా బయటకు రాగా మరికొందరు వినియోగాన్ని తగ్గించారు. వీరికితోడు UKకు చెందిన ప్రఖ్యాత వార్తా సంస్థ 'ది గార్డియన్' కూడా మస్క్ ప్లాట్‌ఫారమ్ నుంచి నిష్క్రమించింది. దానిని టాక్సిక్ మీడియా ప్లాట్‌ఫారమ్ అంటూ ఆరోపించింది.












Click it and Unblock the Notifications