తులసి, అశ్వగంధలో ఔషధ గుణాలు మాయం.. తాత ముత్తాతల నాటి వైద్యం కనుమరుగవుతోందా?
భారతవని ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరు. ఎన్ని రకాల ఇంగ్లీష్ మందులు వచ్చినా సరే ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన మూలికలకున్న పవర్ వాటికి ఉండనే ఉండదు. ఎలాంటి మందులు లేకుండానే రాజుల కాలం నాటి నుంచి మన తాతల తాతల వరకు నిండు నూరేళ్లు బతికారంటే మన ప్రకృతి మహత్యమే. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి వైద్యం చేసే వారే కనుమరుగయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం మన ఇంట్లోని తులసి మొక్క నుంచి హిమాలయాల అంచుల్లో దొరికే జటామాంసి వరకు.. మన ముత్తాతల కాలం నుంచి వస్తున్న మూలికా వైభవానికి ఇప్పుడు పెద్ద గండమే వచ్చిపడింది.
భరతభూమికి ప్రకృతి ప్రసాదించిన పచ్చని ఔషధ భాండాగారానికి వాతావరణ మార్పుల రూపంలో తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే చేదు నిజం ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. జ్వరం వస్తే తులసి ఆకు కషాయం, ఒత్తిడి తగ్గాలంటే అశ్వగంధ, నాడీ వ్యవస్థ ఉత్తేజానికి జటామాంసి లాంటి దివ్యౌషధాలు వాడే సంస్కృతి మనది. అయితే భూగోళంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, క్రమం లేని వర్షపాతం మన సాంప్రదాయ వైద్యం ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ఇంటి ముందున్న తులసికే గ్రహణం!
మన ప్రతీ ఇంటా పూజలందుకోవడమే కాకుండా ఔషధాల గనిగా విరాజిల్లే తులసి కూడా ఈ పర్యావరణ మార్పుల దెబ్బకు తల్లడిల్లుతోంది. వాతావరణంలో వస్తున్న తీవ్ర వైపరీత్యాలు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాల కారణంగా తులసి మొక్కలపై మునుపెన్నడూ లేని విధంగా తెగుళ్ల తాకిడి పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వెలువరించిన నివేదిక ప్రకారం.. తీవ్ర వాతావరణ వైపరీత్యాల వల్ల తులసి మొక్కల్లో ఆకుల పెరుగుదల క్షీణించడమే కాకుండా, వాటిలో లభించే సుగంధ తైలాలు మోతాదు కూడా తగ్గిపోతోంది. పసిపాపల దగ్గు నుంచి సౌందర్య సాధనాల వరకు విస్తృతంగా వాడే ఈ మూలికకు గ్రహణం పడితే, దాని ప్రభావం దేశీ వైద్యంపై తీవ్రంగా పడనుందనడంలో సందేహం లేదు.
ఔషధ గుణాలు మాయం.. అసలు కారణమేంటి?
భారతదేశంలో లభించే దాదాపు 15,000 మూలికా జాతులలో 8,000 వరకు ప్రాచీన వైద్య విధానాలైన ఆయుర్వేదం, సిద్ధ, యునానీలలో వాడుతున్నారు. ఇందులో సుమారు 70 శాతం జాతులు పశ్చిమ, తూర్పు కనుమలు, హిమాలయాలు, ఆరావళి పర్వత శ్రేణుల్లోనే కనిపిస్తాయి. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరగడం, ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు రావడం వల్ల ఈ మొక్కలు తమ రక్షణ కోసం ఉత్పత్తి చేసే ప్రత్యేక రసాయనాల (సెకండరీ మెటాబోలైట్స్) సమతుల్యత దెబ్బతింటోంది. దీనివల్ల మొక్క బయటకు కనిపించేలా బాగా పెరిగినా, దానికి ఉండే అసలైన రోగనిరోధక శక్తి, ఔషధ గుణాలు, వీర్యం కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అశ్వగంధ నుంచి జటామాంసి వరకు.. అడుగంటిపోతున్న రకాలు
కేవలం తులసి మాత్రమే కాకుండా, నాడీ వ్యవస్థను కాపాడే అశ్వగంధ, పొడి ప్రాంతాల్లో పెరిగే గుగ్గులు, హిమాలయాల ఎత్తైన ప్రదేశాల్లో లభించే జటామాంసి, కుట్కి వంటి అరుదైన వృక్ష జాతులు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా చల్లని వాతావరణం ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరిగే జటామాంసి, వేడి పెరగడం వల్ల తగినంత అనుకూల వాతావరణం లేక నాశనమవుతున్నాయి. పెంపకం ద్వారా లభించే ఉత్పత్తుల కంటే అడవుల నుంచి సేకరించే సహజ సిద్ధమైన మూలికల్లోనే శ్రేష్ఠమైన గుణాలు ఉంటాయని, అడవుల నరికివేత, మితిమీరిన సేకరణ వల్ల ఈ ముప్పు రెట్టింపైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రక్షించుకోకపోతే భవిష్యత్తు శూన్యమే!
మన ప్రాచీన మూలికా సంపదను కాపాడుకోవడానికి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ (NMPB) తో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎక్కువే ఉన్నాయి. రైతులు వీటిని వ్యాపారాత్మకంగా పండించడానికి సరైన సాంకేతికతను అందించడంతో పాటు, అడవులలో లభించే ఈ అరుదైన జాతులను పరిరక్షించే చర్యలు వేగవంతం చేయాల్సి ఉంది. తరతరాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడిన మన సహజ ఔషధ గనిని ఇప్పుడైనా కాపాడుకోకపోతే, భవిష్యత్తు తరాలు మన దేశీ వైద్యానికి, ప్రకృతి ప్రసాదించిన వరాలకు శాశ్వతంగా దూరం కాక తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
