మే నెలంతా ఆకాశంలో అద్భుతాలే, అస్సలు మిస్ అవ్వకండి
ఖగోళ ప్రియులకు మే నెల ఒక అద్భుతమైన పండుగ కానుంది. విశ్వాంతరాళంలో అరుదైన గ్రహాల కలయికలు, నిప్పులు చెరిగే ఉల్కాపాతాలు, అరుదైన 'బ్లూ మైక్రోమూన్' వంటి వింతలు కనువిందు చేయనున్నాయి. దాదాపు ఈ వింతలన్నింటినీ ఎటువంటి పరికరాలు లేకుండా మన కళ్ళతోనే నేరుగా చూడవచ్చు. మే నెల పొడవునా రాత్రి ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత దృశ్యాల వివరాలు మీకోసం..
మే 1వ తేదీన పౌర్ణమి వెన్నెలతో ఈ సందడి మొదలవుతుంది. దీనిని 'ఫ్లవర్ మూన్' అని పిలుస్తారు. అయితే, ఈ సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండటం వల్ల సాధారణం కంటే కొంచెం చిన్నదిగా కనిపిస్తాడు, అందుకే దీనిని 'మైక్రోమూన్' అంటారు.
ఆ వెంటనే మే 5, 6 తేదీలలో ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతున్నట్లుగా 'ఈటా అక్వారిడ్' ఉల్కాపాతం సంభవిస్తుంది. ప్రసిద్ధ హేలీ తోకచుక్క వదిలిన శిథిలాల వల్ల ఏర్పడే ఈ ఉల్కలు, గంటకు 50 వరకు మెరుస్తూ రాత్రి ఆకాశంలో కనువిందు చేస్తాయి. తెల్లవారుజామున 3:00 నుంచి 6:00 గంటల మధ్య ఇవి స్పష్టంగా కనిపిస్తాయి.

గ్రహాల విన్యాసాలు.. చంద్రుడితో దోస్తీ!
ఈ నెల మధ్యలో గ్రహాలన్నీ చంద్రుడితో జట్టు కడతాయి. మే 13, 14 తేదీల్లో చంద్రుడు శని, నెప్ట్యూన్, అంగారక గ్రహాలకు అత్యంత సమీపంలోకి వెళ్తాడు. ఈ అరుదైన బహుళ-గ్రహాల కలయిక రాత్రి 8:00 నుంచి 11:30 గంటల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది.
మే 19న అత్యంత ప్రకాశవంతమైన శుక్ర గ్రహంతో చంద్రుడు జతకడతాడు. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశంలో కనిపించే ఈ దృశ్యం ఫోటోగ్రాఫర్లకు ఒక గొప్ప అవకాశం. ఆ తర్వాత మే 20న సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతికి సమీపంగా చంద్రుడు కదులుతూ కనుల పండుగ చేయనున్నాడు.
నక్షత్రాల తోవలో.. అరుదైన బ్లూ మూన్ వరకు!
మే 21న కర్కాటక రాశిలోని 'బీహైవ్' నక్షత్రాల గుంపు వద్ద చంద్రుడు మెరుస్తుండగా, మే 23 నుంచి 27 మధ్య రెగ్యులస్, స్పికా వంటి ప్రకాశవంతమైన నక్షత్రాల చెంతకు చేరుకుంటాడు. ఇక మే 31వ తేదీన ఈ నెలకే హైలైట్ అయిన 'బ్లూ మైక్రోమూన్' ఆవిష్కృతమవుతుంది. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత చిన్న పౌర్ణమిగా నిలవనుంది. చంద్రోదయం తర్వాత తెల్లవారుజామున 4:45 గంటలకు ఇది చాలా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ అరుదైన ఖగోళ వింతలన్నీ మేలోనే జరుగుతుంది కాబట్టి శాస్త్రీయంగా ఎంతో ప్రత్యేకమైన నెలగా మార్చనున్నాయి.














Click it and Unblock the Notifications