NISAR శాటిలైట్ తీసిన మైండ్ బ్లోయింగ్ పిక్! అంటార్కిటికా మంచులో 'వింత పక్షి'..
భూగోళానికి అంచున ఉన్న మంచు ఖండం అంటార్కిటికాలో ఓ వింత వెలుగు చూసింది. నింగి నుంచి పంపిన ఉపగ్రహం తీసిన ఒక చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. విశాలమైన మంచు మైదానంలో రెక్కలు చాచి ఎగురుతున్న ఒక 'హమ్మింగ్ బర్డ్' ఆకారం స్పష్టంగా కనిపించడంతో శాస్త్రవేత్తలు సైతం కాసేపు ఆశ్చర్యపోయారు. నాసా- ఇస్రో సంయుక్తంగా తయారు చేసిన 'నిసార్' (NISAR) శాటిలైట్ ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించింది. అయితే ఇది నిజమైన పక్షి కాదు, ప్రకృతి చెక్కిన ఒక వినూత్నమైన ఆకృతి!

పక్షి కాదు.. మంచులో దాగున్న పర్వత శిఖరం
నిజానికి ఈ పక్షి ఆకారం వెనుక ఒక ఆసక్తికరమైన ప్రకృతి రహస్యం ఉంది. తూర్పు అంటార్కిటికా ప్రాంతంలోని మంచు పొరల మధ్య నుంచి పైకి పొడుచుకు వచ్చిన 'జాతెర్‌జావ్‌షిస్జా' అనే ఒక నల్లటి రాతి పర్వత శిఖరం అది. దీని చుట్టూ సమాంతరంగా ప్రవహిస్తున్న మంచు ప్రవాహాలు, రాళ్ల రంగులు కలిసి సరిగ్గా ఒక పక్షి తన రెక్కలు విప్పినట్లుగా రూపాంతరం చెందాయి. మన కళ్లకు ప్రకృతిలో తెలిసిన ఆకారాలు కనిపించే మానసిక భావన వల్ల ఇది పక్షిలా కనిపిస్తోంది. వేల ఏళ్లుగా అక్కడే ఉన్న ఈ నమూనాను నిసార్ ఉపగ్రహం అత్యంత స్పష్టతతో మన ముందుకు తీసుకొచ్చింది.
మబ్బులను సైతం చీల్చుకెళ్లే రేడార్ సాంకేతికత
ఈ చిత్రాన్ని ఇంత నిశితంగా తీయడం వెనుక నాసా-ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం ఉంది. నిసార్ ఉపగ్రహంలో ఉపయోగించిన 'ఎల్-బాండ్ సింథటిక్ ఎపర్చర్ రేడార్' వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. ఎంతటి దట్టమైన మేఘాలు ఉన్నా, పొగమంచు కమ్మేసినా, చీకటిగా ఉన్నా సరే.. ఈ రేడార్ కిరణాలు భూమి ఉపరితలాన్ని తుచ తప్పకుండా బొమ్మ కట్టించగలవు. సాధారణ కెమెరాలు తీయలేని దృశ్యాలను, మంచు కింద దాగి ఉన్న సూక్ష్మ మార్పులను సైతం ఇది పసిగట్టగలదు.
భూమి అంతరంగాన్ని తెలిపే 'నిసార్'
కేవలం ఈ ఆకారాన్ని చూపించడమే కాకుండా, తన పనితనంలో నిసార్ శాటిలైట్ ఎంతటి పవర్ ఫుల్ తో ఈ ప్రయోగం నిరూపించింది. అంటార్కిటికాలో మంచు కరుగుతున్న తీరు, గ్లేసియర్ల కదలికలు, భూకంపాలు, అడవుల విస్తీర్ణం వంటి కీలక విషయాలను నిరంతరం పర్యవేక్షించడంలో ఈ శాటిలైట్ డేటా ప్రపంచానికి ఎంతో ఉపయోగపడనుంది. మన పర్యావరణంలో వచ్చే మార్పులను ముందుగానే పసిగట్టడానికి భారత్, అమెరికాల ఈ ఉమ్మడి ప్రాజెక్ట్ ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది.














Click it and Unblock the Notifications