కేవలం 4 నిమిషాల్లో ఏ పాము విషమూ చెప్పే ఏఐ సెన్సార్!
పాము కాటుకు గురైన బాధితులకు సరైన సమయంలో సరైన వైద్యం అందాలంటే అది ఏ రకమైన పాము కాటు వేసిందనేది గుర్తించడం అత్యంత కీలకం. ఈ దిశగా వైద్య మరియు సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చున్నారు. కోబ్రా, కోబ్రా జాతికి చెందిన విషం లేదా కందిరీగల విషాన్ని కేవలం నాలుగు నిమిషాల్లోనే కచ్చితంగా వేరు చేసి గుర్తించగల సరికొత్త ల్యాబొరేటరీ సెన్సార్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ వ్యవస్థ ఏకంగా 95 శాతం కచ్చితత్వంతో విషం ఏ పాముదో ఇట్టే చెప్పేయగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
లిక్విడ్ క్రిస్టల్స్, ఏఐ కలయికతో అద్భుత ఫలితాలు
ఈ నూతన పరిజ్ఞానంలో లిక్విడ్ క్రిస్టల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. పాము విషం తగిలినప్పుడు ఈ లిక్విడ్ క్రిస్టల్స్ రూపురేఖల్లో మర్పులు వస్తాయి. ఒక ప్రత్యేకమైన టెక్స్‌టైల్ గ్రిడ్ సహాయంతో అమర్చిన ఈ సెన్సార్‌పై విషం పడిన వెంటనే ఆప్టికల్ నమూనాలు మారుతాయి. పోలరైజ్డ్ ఆప్టికల్ మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ తర్వాత అత్యాధునిక 'మొబైల్ నెట్ వి-3' (MobileNetV3) డీప్ లెర్నింగ్ ఏఐ మోడల్ ఈ నమూనాలను క్షణాల్లో విశ్లేషించి, అది ఏ పాము విషమో కచ్చితంగా నిర్ధారిస్తుంది. కేవలం మిశ్రమంలో 45 మైక్రోగ్రాముల మోతాదు ఉన్నా సరే ఈ సెన్సార్ దీన్ని పసిగట్టగలగడం విశేషం.

పాము కాటు చికిత్సలో వైద్యులు ఎదుర్కొంటున్న అసలు సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామాల్లో పాము కాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. ఉదాహరణకు కేవలం ఇరాన్ దేశంలోనే ఏటా సుమారు 4,500 నుంచి 7,000 వరకు పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. ఏ పాము కాటేసిందో కచ్చితంగా తెలిస్తే ఆయా పాముల విషానికి వ్యతిరేకంగా పనిచేసే మోనోవాలెంట్ యాంటీవెనమ్‌ను ఇచ్చి త్వరగా నయం చేయవచ్చు. అయితే ఏ పాము కుట్టిందో గుర్తించడం కష్టంగా మారడంతో డాక్టర్లు సాధారణంగా అన్ని రకాల విషాలను ఎదుర్కొనే పాలివాలెంట్ యాంటీవెనమ్‌ను వాడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు రోగులలో అలర్జీలు, ఇతర దుష్ప్రభావాలు వచ్చే ప్రమాడముంది. ప్రస్తుతమున్న నిర్ధారణ పద్ధతులు చాలా ఖరీదైనవిగా ఉండటంతో పాటు ఫలితం రావడానికి చాలా సమయం పడుతోంది.
త్వరలో వాస్తవ వైద్య రంగంలోకి.. మరిన్ని పరీక్షలు అవసరం
పాముల విషాన్ని వేగంగా గుర్తించే ఈ సరికొత్త ప్రయోగం వైద్య రంగానికి ఒక మైలురాయిగా నిలిచినప్పటికీ, ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ల్యాబ్‌లో అద్భుత ఫలితాలు ఇచ్చినప్పటికీ, నిజమైన ఆసుపత్రులు, క్లినికల్ పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందనే దానిపై మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ సెన్సార్‌కి ప్రత్యేకమైన యాంటీబాడీలు ఏవీ అవసరం లేకపోవడం దీని ప్రధాన ప్లస్ పాయింట్. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు వైద్యులకు ఇదొక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది.














Click it and Unblock the Notifications
