విశ్వాంతరాళంలో మహా అద్భుతం: 10 వేల సూర్యుల శక్తి బయటపడింది!
విశ్వం అంతం లేని రహస్యాల నిలయం. అందులోనూ 'కృష్ణబిలం' (Black Hole) అంటేనే అంతుచిక్కని ఒక అగాధ శూన్యం. తన దరికి చేరిన కాంతిని సైతం మింగేసే ఈ రాక్షస బిలాలు.. గెలాక్సీ చీకటి కోణాల్లో ఏంచేస్తున్నాయన్నది ఎప్పుడూ ఒక మిస్టరీనే. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక సంచలన నిజం ఖగోళ శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తోంది.
అనంత విశ్వంలో మానవ మేధస్సుకు సవాలు విసిరే కృష్ణబిలాల లోపల అసలు ఏం జరుగుతోంది? తాజాగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త స్టీవ్ ప్రభు నేతృత్వంలోని బృందం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. భూమికి సుమారు 7,200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక రహస్య వ్యవస్థ నుంచి వెలువడుతున్న శక్తి ఉద్గారాల (Energy Emissions) వేగాన్ని వారు తొలిసారిగా లెక్కగట్టారు.

గంటకు 54 కోట్ల కిలోమీటర్లు!
ఈ కృష్ణబిలం నుంచి వెలువడే శక్తి ఉద్గారాలు ఊహాతీతమైన వేగంతో దూసుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని వేగం గంటకు దాదాపు 54 కోట్ల కిలోమీటర్లు. అంటే, విశ్వంలో అత్యంత వేగంగా ప్రయాణించే కాంతి వేగంలో ఇది సరిగ్గా సగం! ఇంతటి అపరిమితమైన వేగంతో ఒక బిలం నుంచి శక్తి బయటకు రావడం అనేది విశ్వం యొక్క అద్భుతమైన శక్తికి నిదర్శనమని పరిశోధకులు పేర్కొంటున్నారు.
Cygnus X-1: ఒక రాక్షస జంట!
పాలపుంత గెలాక్సీలోని 'సిగ్నస్' తారామండలంలో దాగి ఉన్న 'సిగ్నస్ ఎక్స్-1' అనే వ్యవస్థలో ఈ వింత చోటుచేసుకుంది. ఇక్కడ కేవలం కృష్ణబిలం మాత్రమే లేదు.. దీనికి జతగా ఒక భారీ నక్షత్రం కూడా ఉంది. ఈ కృష్ణబిలం ఆ నక్షత్రాన్ని తన శక్తితో లాక్కుంటూ, ప్రతిఫలంగా వెదజల్లుతున్న శక్తి ఎంతో తెలుసా? సుమారు 10 వేల సూర్యుళ్లకు సమానం! అంటే మన సూర్యుడి కంటే 10వేల రెట్లు ఎక్కువ శక్తిని ఇది ఒక్క క్షణంలో విడుదల చేస్తోంది.
శాస్త్రవేత్తల విస్మయం..
కృష్ణబిలం అంటే పదార్థాన్ని తనలోకి లాక్కునేది మాత్రమే అని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ, అది తనలో నుంచి కొంత శక్తిని 'జెట్స్' రూపంలో ఇంతటి వేగంతో బయటకు విసిరేస్తుందని నిరూపితం కావడం ఖగోళ పరిశోధనల్లో ఒక కీలక మలుపు. ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల ఈ పరిశోధన విశ్వం యొక్క పుట్టుక, నక్షత్రాల అంతం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసేలా ఉంది.














Click it and Unblock the Notifications