పాకిస్తాన్ తో మ్యాచ్ వేళ.. అభిషేక్ పై ఆచితూచి నిర్ణయం: కొలంబోలో పేరెంట్స్
ఇంకొక్క రోజే మిగిలివుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆర్క్ రైవల్స్ భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీనికోసం రెండు జట్లూ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. ఇప్పటికే రెండు జట్లూ కొలంబోకు చేరుకున్నాయి కూడా. పాకిస్తాన్ జట్టు పరిస్థితెలా ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది.
ఇప్పటికే ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అతని ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కడుపు సంబంధిత సమస్యలతో ఇటీవలే ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరిన అభిషేక్ ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు గానీ ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఒకట్రెండు మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చని ఇదివరకే కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వెల్లడించాడు.

అభిషేక్ శర్మ పూర్తిగా ఫిట్‌గా లేకపోతే- టీమిండియా ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో పెద్ద మార్పులు చేయాల్సి వస్తుంది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్నాడు గానీ అతను ఫామ్ ను అందిపుచ్చుకోవట్లేదు. నమీబియాపై మెరుపు బ్యాటింగ్ తో ఇన్నింగ్ ఆరంభించినప్పటికీ.. ఎక్కువ సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేదు. 8 బంతుల్లో 22 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇది ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ పై గెలవాలంటే శుభారంభం తప్పదు.
ఈ పరిస్థితుల మధ్య అభిషేక్ శర్మ తల్లిదండ్రులు కొలంబో చేరుకున్నారు. అభిషేక్ శుక్రవారం జట్టుతో పాటు కొలంబోకు వచ్చాడు. దీంతో పాకిస్తాన్ తో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండొచ్చనే ఆశలు రేకెత్తాయి గానీ.. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అతి తక్కువ సమయంలోనే అతన్ని జట్టు మేనేజ్మెంట్ ఆడిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. అతని ఫిట్‌నెస్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని జట్టు భావిస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అమెరికాతో తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసమే అభిషేక్‌ను తొందరపడి తీసుకురావద్దని మాజీ క్రికెటర్లు సూచించారు కూడా. సూపర్ 8, నాకౌట్ దశల కోసం అభిషేక్ ను రిజర్వ్ చేసి ఉంచాలని చెబుతున్నారు. మ్యాచ్ సమయానికి అభిషేక్ కోలుకోకపోయినా అతని విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది టీమ్ మేనేజ్మెంట్.












Click it and Unblock the Notifications