ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఆ స్పెషల్ సెలబ్రేషన్: అభిషేక్ శర్మ
తమ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతోనే తన సెంచరీని ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. 20 ఓవర్ల పాటు ఆడాలని జేమ్స్ ఫ్రాంక్లిన్ తనకు సూచించాడని, మురళీధరన్ కూడా అదే చెప్పారని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మను ఆరెంజ్ క్యాప్ వరించింది. తొలి ఇన్నింగ్స్ అనంతరం ఐపీఎల్ నిర్వాహకులు అతనికి ఆరెంజ్ క్యాప్ అందజేశారు. ఈ సందర్బంగా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అభిషేక్ శర్మ ఉప్పల్ మైదానం అంటే తనకు ఇష్టమని తెలిపాడు.

ఉప్పల్ మైదానం అంటే ఇష్టం..
'మా ఆరెంజ్ ఆర్మీ ముందు రాణించడం ఎప్పుడూ ప్రత్యేకం. ఉప్పల్ మైదానంపై నాకు ఉన్న ప్రేమ సాటిలేనిదని అందరికీ తెలిసిందే. అయితే డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన అలవాటు లేకపోవడంతో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాను. నేను డెత్ ఓవర్లకు తగ్గట్లు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదని కూడా అనిపించింది. కానీ క్లాసెన్ ఇన్నింగ్స్‌ను ముగించిన తీరు జట్టు స్కోరుకు చాలా ప్లస్ అయ్యింది.
నా బ్యాటింగ్ షేప్ కోల్పోకూడదని క్లాసెన్ కోరుకున్నాడు. బహుశా నేను బౌండరీలు కొట్టడానికి మరీ ఎక్కువగా ప్రయత్నించి ఉండవచ్చు. ఎందుకంటే పవర్‌ప్లే లేదా మిడిల్ ఓవర్లలో నేను అలా చేయను. కానీ నా మనసులో ఒకటి ఉంది. కనీసం నేను బౌండరీల కోసం వెళ్లకున్నా, స్ట్రైక్ రొటేట్ చేసి క్లాసెన్‌కు ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే డెత్ ఓవర్లలో అతను ఎంత ప్రమాదకరమైన బ్యాటరో మనందరికీ తెలుసు.
మా కోచ్ కోసమే ఆ సెలెబ్రేషన్స్..
నేను 20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని మా కోచ్ జేమ్స్ ఫ్రాంక్లీన్ కోరుకున్నాడు. మురళీధరన్ కూడా అదే చెప్పారు. బహుశా నేను 20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి అనుకుంటా. అందుకే ఆ సెలబ్రేషన్. ఖచ్చితంగా.. ఈ గ్రౌండ్‌లో సెంచరీ చేయడం ఎప్పుడూ స్పెషలే.
వికెట్ బ్యాటింగ్‌కు అంత సులభంగా ఏం లేదు. ఈ పిచ్‌పై 230+ స్కోర్ సరిపోతుంది. మా ప్రణాళిక ఎప్పుడూ ఒకటే.. టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఆడాలి. మేం ఎప్పుడూ దానికోసమే ప్రయత్నిస్తాం.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
Abhishek Sharma is the brand new owner of the #TATAIPL 2026 Orange Cap 🤟🚀 #AbhishekSharma pic.twitter.com/h73ickFBJF
— Indraj Babal Suratgarh (@INDRAJBABAL) April 21, 2026












Click it and Unblock the Notifications