మెస్సీ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై!
Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ అర్జెంటీనా లెజెండ్, స్టార్ ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా వేదికగా సోమవారం సాయంత్రం ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. జులైలో స్పెయిన్‌తో జరిగిన 2026 ప్రపంచ కప్ పైనల్లో 1-0 తేడాతో అర్జెంటీనా ఎదుర్కొన్న ఓటమి, తన అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ అని మెస్సీ స్పష్టం చేశారు. దీంతో నీలం-తెలుపు రంగుల అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ఇక కనిపించడని అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున 207 మ్యాచ్ లు ఆడిన మెస్సీ.. ఏకంగా 125 గోల్స్ చేయడంతో పాటు 68 అసిస్ట్ లను అందించారు. తన సుదీర్ఘ కెరీర్లో దేశానికి ఓ ఫిఫా ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించి ఎవరికీ అందని శిఖరాలను చేరుకున్నారు. 21 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ అద్భుతమైన ఫుట్ బాల్ ప్రయాణాన్ని ముగిస్తూ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన అధ్యాయానికి మెస్సీ తెరదించారు.

ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీ తన రిటైర్మెంట్ భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు. "నా తండ్రికి జరిగిన పరిణామం తర్వాత ఈ నిర్ణయం పట్ల నేను మరింత స్పష్టతకు వచ్చాను. ఫిఫా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి తప్పుకోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. కానీ ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఈ జెర్సీ కోసం నేను ఎల్లప్పుడూ నా శక్తినంతటినీ ధారపోశాను. అర్జెంటీనా ప్రజలను గర్వపడేలా చేయడానికి చివరి వరకు పోరాడాను" అని మెస్సీ పేర్కొన్నారు.
తనకు ఇక ఏమీ ఇవ్వడానికి మిగిలి లేదని.. జట్టులోకి అద్భుత యువ ప్లేయర్లు వస్తున్నారని లియోనెల్ మెస్సీ పేర్కొన్నారు. " గత 20 ఏళ్లుగా నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. మైదానం బయట నుంచి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ జట్టుకు మద్దతుగా ఉంటాను. నా కుటుంబం, కోచ్ లు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. ఒక అర్జెంటీనియన్ గా పుట్టినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను"అని రాసుకొచ్చారు. అపారమైన అనుభవం, చిరస్మరణీయమైన జ్ఞాపకాలతో గర్వంగా అంతర్జాతీయ వేదిక నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు ఈ దిగ్గజ ఆటగాడు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications