ఆస్ట్రేలియన్లది అసలు బ్యాటింగేనా..?!
AUS vs NAM: టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా తిరుగులేని గెలుపును సాధించింది. నమీబియాపై భారీ విజయాన్ని అందుకుంది. తొమ్మిది వికెట్లతో తన ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ గెలిచింది ఆసీస్. ఆరు పాయింట్లతో గ్రూప్ బీలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 16వ తేదీన స్కాట్లాండ్‌తో ఆడబోతోంది.
ఆంటిగ్వా అండ్ బార్బుడాలోని సర్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 17 ఓవర్లల్లో 72 పరుగులకు కుప్పకూలింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన కేప్టెన్ గెర్హార్డ్ ఎరాస్ముస్ ఒక్కడే టాప్ స్కోరర్. 43 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ఓపెనర్ మైఖెల్ వాన్ లింగెన్ 10 తప్ప మరెవరూ సింగిల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు.

ఆస్ట్రేలియన్ బౌలర్లందరూ వికెట్లను పడగొట్టారు. ప్రత్యేకించి- స్పిన్నర్ ఆడమ్ జంపా రెచ్చిపోయాడు. నాలుగు ఓవర్ల కోటాలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ హేజిల్‌వుడ్- 2, మార్కస్ స్టొయినిస్- 2, పాట్ కమ్మిన్స్- 1, నాథన్ ఎల్లిస్- 1 వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా స్టేడియంలో సునామీ సృష్టించింది. ఐపీఎల్ తరహాలో రెచ్చిపోయింది. గెలవడానికి అవసరమైన 73 పరుగులను కేవలం 5.4 ఓవర్లలోనే కొట్టి అవతల పడేసింది. నమీబియా బౌలర్లను తుక్కు కొట్టారు ఆస్ట్రేలియాన్ బ్యాటర్లు. మెరుపు ఇన్నింగ్ ఆడారు.
ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 34, కేప్టెన్ మిఛెల్ మార్ష్ ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎనిమిది బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 20 పరుగులు చేవాడు. వీస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5.4 ఓవర్లల్లో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.












Click it and Unblock the Notifications