ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ గాయంపై BCCI తాజా బులెటిన్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సిడ్నీలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయం కావడం వల్ల ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. త్వరలోనే భారత్ కు వస్తాడని పేర్కొంది.
శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్న తీరు పట్ల బీసీసీఐ మెడికల్ టీమ్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఊహించిన దానికంటే వేగంగా కొలుకుంటోన్నాడని భావిస్తోంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ మెడికల్ టీమ్ వివరించింది. సిడ్నీతో పాటు భారత్ లోని వైద్య నిపుణులు అతని గాయం గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారని, కోలుకుంటున్న తీరు పట్ల సంతోషంగా ఉన్నారని పేర్కొంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

కిందటి నెల 25వ తేదీన సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ ను పట్టడానికి శ్రేయాస్ అయ్యర్ డైవ్ చేయాల్సి వచ్చింది. డైవింగ్ క్యాచ్ పట్టినప్పుడు గాయపడ్డాడు. మొదట ఇది పక్కటెముక గాయంగా భావించారు గానీ అంతకంటే తీవ్రమైనదిగా తేలింది. దీంతో హుటాహుటిన ఐసీయూకి తరలించారు.
క్యాచ్ పట్టే సమయంలో అతని పొత్తికడుపునకు గాయం అయ్యింది. దీనివల్ల అతనికి స్ప్లీన్ లాసరేషన్ చోటు చేసుకుంది. ఫలితంగా అంతర్గత రక్తస్రావానికి గురయ్యాడు. గాయం వల్ల అప్పటికప్పుడు గ్రౌండ్ ను వీడాల్సొచ్చింది శ్రేయాస్ అయ్యార్ కు. సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో గాయాన్ని, అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించారు. సర్జరీ ద్వారా దీన్ని నియంత్రించారు. బీసీసీఐ, సిడ్నీ ఆసుపత్రి స్పెషలిస్ట్ డాక్టర్ కౌరూష్ హగిగి, అలాగే డాక్టర్ దిన్‌షా పార్దివాలాతో కూడిన మెడికల్ టీమ్ పర్యేక్షణలో కొనసాగాడు.
అదృష్టవశాత్తూ ఫిజియో, టీమ్ డాక్టర్ తక్షణ స్పందన వల్ల అతనికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మరికొన్ని ఫాలో అప్ కన్సల్టేషన్ల కోసం ఇంకొన్ని రోజుల పాటు సిడ్నీలోనే ఉంటాడు. డాక్టర్ల నుంచి పూర్తి అనుమతి లభించిన తర్వాతే స్వదేశానికి తిరిగి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications