టీమిండియాకు భారీ షాక్..!!
IND vs AUS: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను ఎదుర్కొనాల్సి ఉంది. మొన్నటికి మొన్న సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైన నేపథ్యంలో ఈ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీమిండియా. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.
తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్‌బోర్న్‌లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక.

ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీమిండియా. శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అవసరమైన కసరత్తు చేస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని అధిగమించి, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడం, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని చేరుకోవాలని భావిస్తోంది.
ఈ పరిణామాల మధ్య టీమిండియాకు భారీ షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. పెర్త్ వాకా స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని వేలికి గాయమైంది. స్లిప్‌లో క్యాచ్ పట్టే క్రమంలో బంతి అతని వేలిని బలంగా తాకింది. దీనితో నొప్పితో విలవిల్లాడాడు గిల్. అతని వేలికి స్కాన్ చేయగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.
ఫలితంగా- ఈ నెల 22వ తేదీన ఆరంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో గిల్ ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఇంకా సమయం ఉన్నందున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టులో అతని చోటు దక్కతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని టీమ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. గాయం తీవ్రతను అంచనా వేస్తోన్నామని స్పష్టం చేసింది.
ఇప్పటికే బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డ విషయం తెలిసిందే. నెట్ ప్రాక్టీస్ సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ సంధించిన ఓ బౌన్సర్‌ను ఆడే క్రమంలో గాయపడ్డాడు రాహుల్. అప్పటికప్పుడు నెట్స్‌ను వీడాల్సి వచ్చింది. ఫిజియోథెరపిస్ట్ సహకారంతో ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం వల్ల యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్ ఆరంభించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications