శ్రీలంక బ్యాటర్ చాకిరేవు- ఫాస్టెస్ట్ సెంచరీ: చివరి ఓవర్ లో హైడ్రామా
కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. డాసన్ షనక సృష్టించిన సునామీ ఇన్నింగ్స్, జెరెమియా లూయిస్ కెరీర్ బెస్ట్ బౌలింగ్ దెబ్బకు సెయింట్ లూసియా కింగ్స్ మట్టికరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల కొండంత స్కోరు సాధించగా.. ఛేజింగ్‌లో కింగ్స్ టీమ్ 98 పరుగులకే ఆలౌట్ అయింది. 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పేట్రియాట్స్ జట్టుకు ఆరంభం అంత ఆశాజనకంగా సాగలేదు. మొదటి మూడు ఓవర్లలో ఓపెనర్ కైల్ మేయర్స్ వికెట్ కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రీ ఫ్లెచర్ రాకతో ఆట స్వరూపమే మారిపోయింది. మాథ్యూ ఫోర్డే వేసిన ఓవర్ లో సిక్సర్, ఫోర్‌తో జోరు పెంచారు. ఆ తర్వాతి ఓవర్ లోనే మహీష్ తీక్షణ బౌలింగ్‌లో ఫ్లెచర్ ఏకంగా 19 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పేట్రియాట్స్ స్కోరు వికెట్ నష్టానికి 59 పరుగులకు చేరుకుంది.

ఫ్లెచర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 64 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతని స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన డాసన్ షనక రావడం రావడంతోనే కింగ్స్ బౌలర్లను చీల్చిచెండాడాడు. జోషువా బిషప్, రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 24 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఈ శ్రీలంకన్ బ్యాటర్.. అంతే వేగవంతో సెంచరీ బాదాడు. 39 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. సీపీఎల్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ సెంచరీ.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో షనక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాది ప్రత్యర్థి బౌలింగ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పేట్రియాట్స్ 4 వికెట్లు నష్టపోయి 235 పరుగుల భారీ స్కోరును అందుకుంది. షనక 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. కింగ్స్ బౌలర్లలో ఫోర్డే 48 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింగ్స్ మొదటి ఓవర్ లోనే కామిల్ పూరన్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వరుసబెట్టి వికెట్లు పడ్డాయి. జాన్ క్యాంప్ బెల్, చరిత్ అసలంక కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి కింగ్స్ 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, జెరెమియా లూయిస్ తమ అద్భుత స్పెల్‌తో కింగ్స్ వెన్ను విరిచారు.
టిమ్ సీఫర్ట్- 50, కామిల్ పూరన్- 0, జాన్ క్యాంప్ బెల్- 11, చరిత్ అసలంక- 1, ఒబుస్ పినార్- 10, రోస్టన్ ఛేజ్- 8, మాథ్యూ ఫోర్డె- 0, అమరి గూడ్రిజ్- 8, జోష్వా బిషప్- 6, మహీష్ తీక్షణ- 2, కీన్ గెస్టాన్- 1 (నాటౌట్) పరుగులు చేశారు. తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో చేజ్, ఫోర్డేలను అవుట్ చేశాడు లూయిస్. క్రీజ్ లో ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ అందుకున్న టిమ్ సీఫెర్ట్ ను యాష్మీడ్ నెడ్ పడగొట్టడంతో కింగ్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఈ మ్యాచ్ లో లూయిస్ 10 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కింగ్స్ ఇన్నింగ్స్ 13.5 ఓవర్లలో 98 పరుగులకే ముగిసింది.













Click it and Unblock the Notifications