టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్‌మెంట్ వార్తలు నిజమేనా?
టీ20 క్రికెట్‌లో తనదైన '360 డిగ్రీల' షాట్లతో ప్రపంచాన్ని ఊగించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు ముగిసిన వెంటనే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారా? అంటే.. క్రీడా వర్గాల్లో అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. శ్రీలంకలో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌ను ఫైనల్ చేర్చి, న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైన తరుణంలో ఈ రిటైర్మెంట్ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్, టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని వీరుడిగా ఉన్నప్పటికీ, మిగిలిన ఫార్మాట్లలో ఆయనకు అవకాశాలు రాకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉండటం, వన్డే జట్టులోనూ యువ ఆటగాళ్ల పోటీ పెరగడంతో.. ఇకపై కేవలం ఒకే ఫార్మాట్‌కు పరిమితమవ్వడం కంటే గౌరవప్రదంగా తప్పుకోవడమే మేలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. ముఖ్యంగా బీసీసీఐ (BCCI) ఫ్యూచర్ ప్లాన్స్‌లో భాగంగా యువ రక్తాన్ని ప్రోత్సహించాలనుకోవడం కూడా సూర్యపై ఒత్తిడి పెంచుతోందనే టాక్ నడుస్తోంది.

Suryakumar Yadav ఫామ్ కూడా సవాల్‌గా మారిందా?
ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్ ప్రయాణం మిశ్రమంగా సాగింది. టోర్నీ ఆరంభంలో అమెరికాపై 84 పరుగులతో వీరవిహారం చేసినా, ఆ తర్వాత వరుస మ్యాచుల్లో భారీ స్కోర్లు చేయలేకపోయారు. 8 మ్యాచుల్లో 242 పరుగులు చేసినా.. సూర్య స్థాయికి ఇది తక్కువనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నప్పటికీ, వ్యక్తిగత బ్యాటింగ్‌లో మునుపటి మెరుపులు తగ్గడం విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు అవకాశం కోసం వేచి చూస్తుండటంతో, తన స్థానాన్ని యువకులకు వదిలేయాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం.
ఫైనల్ మ్యాచ్.. సూర్యకు 'లాస్ట్ రైడ్'?
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ పోరు సూర్యకుమార్ యాదవ్‌కు భారత జెర్సీలో చివరి మ్యాచ్ అవుతుంది. ఒక కెప్టెన్‌గా దేశానికి ప్రపంచకప్ అందించి, గెలుపుతో కెరీర్‌ను ముగించాలన్నది ఆయన ప్లాన్ కావచ్చు. అయితే, దీనిపై అటు ఆటగాడి నుంచి కానీ, ఇటు బీసీసీఐ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య దృష్టి అంతా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడటంపైనే ఉంది. మరి స్కై నిజంగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక తన విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్తారా? అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications