‘కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో’ అన్న క్రికెటర్.. ఇప్పుడు తల్లి అయింది!
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్ వ్యాట్(డ్యానీ వ్యాట్) తల్లిగా తన జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె మహిళా భాగస్వామి జార్జీ హాడ్జ్ ఓ అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. డ్యానీ వ్యాట్, జార్జీ హాడ్జ్‌లు స్వలింగ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట తల్లి అయిన సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ప్రముఖులు ఈ స్వలింగ సంపర్క జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ ముద్దుల కూతురికి వారు 'డైసీ జేమ్స్ వ్యాట్ హాడ్జ్' అని నామకరణం చేశారు.
భారతీయ క్రికెట్ అభిమానులకు డ్యానీ వ్యాట్ పేరు చాలా సుపరిచితం. దాదాపు 12 ఏళ్ల క్రితం(2014 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమయంలో) అప్పటి టీమిండియా యువ సంచలనం విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయిన డ్యానీ వ్యాట్.. అప్పట్లో తన 'ఎక్స్' ఖాతా ద్వారా "కోహ్లీ.. నన్ను పెళ్లి చేసుకో" అంటూ ఓపెన్‌గా ప్రపోజ్ చేసి అప్పట్లో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆమెను ప్రత్యేకంగా కలిసి ఓ క్రికెట్ బ్యాట్‌ను కూడా బహుమతిగా ఇచ్చారు. ఇటీవలే ఆమెను మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం విశేషం.

డ్యానీ వ్యాట్, జార్జీ హాడ్జ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జార్జీ హాడ్జ్ వృత్తిరీత్యా ఓ ఫుట్‌బాల్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. వీరు 2023 ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకోగా, ఆగస్టు 2024లో లండన్‌లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తాము ఓ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించారు. పెళ్లయిన దాదాపు రెండేళ్ల తర్వాత వారి జీవితంలోకి చిన్నారి డైసీ ప్రవేశించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. జార్జీ హాడ్జ్ మైదానంలో ఎప్పుడూ డ్యానీని ఉత్సాహపరుస్తూ కనిపించేవారు, ఇప్పుడు వీరిద్దరూ కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇక డ్యానీ వ్యాట్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన, వైట్-బాల్ క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 120 వన్డేలు, 178 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్న డ్యానీ.. వన్డేల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2,074 పరుగులు సాధించారు. అలాగే టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2 సెంచరీలు, 21 అర్ధసెంచరీల సహాయంతో ఏకంగా 3,335 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టులో అత్యంత నమ్మకమైన లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచారు.
Danni Wyatt-Hodge and wife Georgia welcome baby girl Daisy James Wyatt-Hodge 👶
— Female Cricket (@imfemalecricket) May 23, 2026
Congratulations to the couple ❤️#CricketTwitter pic.twitter.com/ak9HQsm27d












Click it and Unblock the Notifications