6, 6, 6, 6, 6, 4: హార్దిక్ పాండ్యా.. మ్యాడ్ బ్యాటింగ్
భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్, బరోడా కేప్టెన్ హార్దిక్ పాండ్యా తడాఖా చూపాడు. మ్యాడ్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలు చుక్కలు చూపాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. 92 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 133 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యాష్ ఠాకూర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హార్దిక్ పాండ్యా 50 ఓవర్ల ఫార్మట్ కు తిరిగి రావడం ఇదే తొలిసారి. దీంతో అతని ఆటతీరుపై అందరి దృష్టి నెలకొంది. దీనికి అనుగుణంగా అతని బ్యాటింగ్ సాగింది. స్టేడియంలో మినీ సునామీనే సృష్టించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ఎలైట్ గ్రూప్ B మ్యాచ్‌లో బరోడా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ దిగాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

19.1 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా. జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఆ తర్వాత 30.3 ఓవర్లలో 136 పరుగుల వద్ద అతని సోదరుడు కృనాల్ పాండ్యా వికెట్‌ను కూడా కోల్పోయింది బరోడా. అక్కడి నుంచి గేర్ మార్చాడు. విదర్భ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఎదురుదాడికి దిగాడు. 39వ ఓవర్‌లో ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్నర్ పార్థ్ రేఖడేకు చుక్కలు చూపించాడు.
ఆ ఓవర్ ప్రారంభ సమయంలో 66 పరుగులతో ఉన్న హార్దిక్ పాండ్యా.. ఆ ఓవర్ ఆరంభించిన పాండ్యా, అది ముగిసే సరికి సెంచరీని అందుకున్నాడంటే అతని బ్యాటింగ్ వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. వరుసగా అయిదు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఆ ఓవర్‌లో 34 పరుగులు రాబట్టాడు. చివరి బంతిని బౌండరీకి పంపి తన తొలి లిస్ట్ ఏ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రేఖడే బౌలింగ్ లో అతను కొట్టిన పరుగులు 6, 6, 6, 6, 6, 4
ఈ శతకం సాధించడానికి ముందు 32.4 ఓవర్ల వద్ద పార్థ్ రేఖడే బౌలింగ్‌లో పాండ్యా 57 పరుగుల వద్ద ఉండగా, లాంగ్ ఆన్‌లో యష్ రాథోడ్ క్యాచ్ జారవిడిచాడు. ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పాండ్యా 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 భారీ సిక్స్‌లతో 133 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ వల్ల బరోడా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.












Click it and Unblock the Notifications