Glenn Maxwell: భారత్‌పై సునామీ సెంచరీ: అందుకే అతనికి ఆ పేరు..!!
Glenn Maxwell: భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆస్ట్రేలియాతో సోమవారం రాత్రి గువాహటిలోని బారాబాంకి స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచివుంటే సిరీస్ భారత్ సొంతం అయ్యుడేంది. అది సాధ్యపడలేదు. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత ఆధిక్యం తగ్గింది. 2-1గా నిలిచింది. నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1వ తేదీన రాయ్‌పూర్‌లో జరుగుతుంది.
విశాఖపట్నం, తిరువనంతపురంలల్లో తొలి రెండు టీ20 మ్యాచ్‌లల్లో భారత్ ఘన విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. గువాహటిలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసి 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది యంగ్ టీమిండియా. చివరి బంతి వరకూ పోరాడింది ఆస్ట్రేలియా. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 225 పరుగులతో విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో అసలు హీరో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell). సెంచరీతో కదం తొక్కాడు. 48 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాడ్ మ్యాక్సీ అని ఫ్యాన్స్ పెట్టుకున్న నిక్ నేమ్‌ను సార్థకం చేసుకున్నాడు. కేప్టెన్ మాథ్యూ వేడ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 16 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
ఈ సెంచరీతో టీమిండియా రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. టీ20 ఇంటర్నేషనల్స్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేశాడు. ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఖాతాలో కూడా నాలుగు సెంచరీలు చేరాయి. నాలుగు టీ20 ఇంటర్నేషనల్స్ సెంచరీలతో రోహిత్ సరసన నిలిచాడు.
అంతకుముందు భారత్ ఇన్నింగ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) చేసిన సెంచరీని మరిపించాడు. మ్యాక్సీ. 57 బంతుల్లో 13 ఫోర్లు, ఏడు సిక్సర్లతో గైక్వాడ్ చేసిన 123 పరుగులు.. దీనిముందు తేలిపోయాయి. విన్నింగ్ సెంచరీ కావడంతో మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చినట్టయింది.
ఈ మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారు. ప్రత్యేకించి- ప్రసిద్ధ్ కృష్ణ. తన నాలుగు ఓవర్ల కోటాలో 68 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్కో ఓవర్‌కు సగటున 17 పరుగులను పిండుకున్నారు ఆసీస్ బ్యాటర్లు. ఓ టీ20 ఇంటర్నేషనల్‌లో ఓ భారత బౌలర్ ఇంత భారీగా పరుగులను ఇచ్చుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఈ అన్ వాంటెడ్ రికార్డ్.. యజువేంద్ర చాహల్ పేరు మీద ఉండేది.












Click it and Unblock the Notifications