కొత్త కేప్టెన్.. కొత్త కోచ్: తొలి మ్యాచ్ ఆడే తుదిజట్టులో కీ ప్లేయర్లు వీళ్లే
IND vs SL 1st T20I: ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది భారత జట్టు. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే సిరీస్‌లో లంకను ఎదుర్కొనబోతోంది. వరల్డ్ కప్ ఘన విజయం సాధించిన తరువాత టీమిండియా ఆడబోతోన్న రెండో సిరీస్ ఇదే కావడం మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇంతకుముందు జింబాబ్వేలో పర్యటించి వచ్చింది జట్టు. అక్కడ విజయకేతనాన్ని ఎగురవేసింది. అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. ఇక శ్రీలంకతో సిరీస్‌కు రెడీ అయింది. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే సిరీస్‌లో తలపడాల్సి ఉంది. ఇప్పటికే లంకకు చేరుకుంది టీమ్.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ శనివారం సాయంత్రం 7 గంటలకు ఆరంభం కాబోతోంది. పల్లెకెలె స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. 28, 30 తేదీలతో జరిగే మ్యాచ్‌లో టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగుస్తుంది. ఆ వెంటనే- వన్డే సిరీస్ మొదలవుతుంది. 2, 4, 7 తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దీనికి వేదిక.
టీ20 ఫార్మట్‌కు మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. అతనికి ఇదే తొలి సిరీస్. గతంలో ఎప్పుడూ కేప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం లేదు. తొలుత హార్దిక్ పాండ్యాకు పగ్గాలను అప్పగించాలని భావించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సూర్య చేతికి కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది బీసీసీఐ.
అలాగే- జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన గౌతమ్ గంభీర్‌కూ ఇదే తొలి సిరీస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీ20 వరల్డ్ కప్ వరకు ఈ స్థానంలో రాహుల్ ద్రావిడ్ కొనసాగాడు. జింబాబ్వే సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఇక రెగ్యులర్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ జట్టుతో పాటు శ్రీలంకలో ఉన్నాడు.
తుదిజట్టు రూపకల్పనలో వారిద్దరి సత్తా బయటపడనుంది. ఎలాంటి ప్లేయర్లు, ఆల్ రౌండర్‌కు ప్లేయింగ్ 11లో చోటు కల్పిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఈ టూర్‌కు సెలెక్ట్ అయిన ప్లేయర్లందరూ టీ20 స్పెషలిస్టులు కావడం, ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటం వల్ల తుదిజట్టు ఎంపిక కత్తి మీద సాములాంటిదే.
విజయంతో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్న కొత్త కేప్టెన్, కొత్త హెడ్ కోచ్..దానికి అనుగుణంగానే ప్లేయర్లను సెలెక్ట్ చెయ్యొచ్చు. తుదిజట్టులో- యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కేప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్/ఖలీల్ అహ్మద్‌ను తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications